Facebook Twitter
నడిచే దైవం మానాన్న...

తాను పస్తులుంటేనేమి?
పచ్చడిమెతుకులు తింటేనేమి?
మాకు మాత్రం పరమాన్నం
పంచిపెట్టారు...మానాన్న

మాకు కాలేజీ ఫీజులు
కట్టిన...మానాన్న
పండుగలకు కొత్తబట్టలు
కొనిచ్చిన...మానాన్న
ఉన్నత విద్య నందించాలని
ఆశపడిన...మానాన్న
అంగరంగ వైభవంగా వివాహాలు
జరిపించిన...మానాన్న
మా మంచిసంబంధాల విలువ
అరిగిన తిరిగి తెగిన ఆయన
కాలి చెప్పులకు తెలుసు
ఆయన చిందించిన స్వేదం
పడిన తపన...చేసిన త్యాగం
అప్పులవాళ్ళందరికి తెలుసు

"ఘనుడు త్యాగధనుడు" మానాన్న
గుడిలేకున్ననేమి "నడిచే దైవం" మానాన్న
మా కుటుంబమే మానాన్నకు "పాలరాతిగుడి"
ఆ దైవానికి మేమే "పూజారులం మేమే భక్తులం"

నాన్నా మీపేరును పుట్టే మాబిడ్డకు పెట్టుకోవాలని
మేం కన్న కమ్మని కలలకు మీ కోడళ్ళు అడ్డుపడ్డారు
అందుకే మమ్మల్ని  క్షమించండి నాన్నా ! క్షమించండి !

మా హృదయాలను కోవెలగా చేసి నిత్యం పూజిస్తూ
మరో జన్మంటూ ఉంటే తిరిగి మీ కడుపునే పుట్టాలని
పైనున్న ఆపరమాత్మను ఆశతో అర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం
నాన్నా ఓ నాన్నా ! మీకు వందనం ! పాదాభివందనం !!