ఆమె...పుట్టగానే
ఇంట్లో అడుగు పెట్టగానే
"ఇంటికి మహాలక్ష్మి"వచ్చిందని
... తల్లిదండ్రుల సంబరం
ఆమె...ఆటల్లో పాటల్లో మేటీ
చదువులోను "ఉత్తమ విద్యార్థి"
... స్కూల్ టీచర్ల అభినందన
ఆమె...గర్వం అహం అసూయ
ద్వేషం లేని ఒక "గొప్ప స్నేహశీలి"
...తోటి ప్రాణ స్నేహితుల ప్రశంస
ఆమె...ఒక "ప్రేమ దేవత"
ఆమె... ప్రేమకు ప్రతిరూపం
ఇష్టపడిన ప్రియుని మనసున
...ఉప్పొంగిన ఓ మధుర భావన
ఆమె...నాకు దేవుడిచ్చిన
"బంగారు బహుమతి"
ఆమె..."ఒక ఉత్తమ ఇల్లాలు...
...ఒక భర్త అంతర్వాణి
మా అమ్మ "ప్రేమమయి"
మా అమ్మ "అమృతమయి"
ఇంటికి దీపం మా కంటికి వెలుగు
...పిల్లల మనసులోని మాట
ఆమె...మా కోడలు కాదు మా
"కడుపున పుట్టని కన్నకూతురు"
...అత్తామామల ఏకాభిప్రాయం
ఆమె...మా కంపెనీకి ఒక "ఆభరణం"
ఆమె...కృషి పట్టుదల అందరికీ
ఆదర్శం ఆమె ఒక "స్పూర్తి ప్రదాత"
...కంపెనీ బాస్ కాంప్లిమెంట్స్
ఆమె...ఎంతో "కలుపుగోలు మనిషి"
ప్రతివారికి ప్రేమను పంచుతుంది
...ఇరుగు పొరుగువారి పొగడ్తలు
ఆమె...ఎంతఎత్తుకు ఎదిగినా ఒదిగిఉండే
"ఉత్తమురాలు" ఎక్కవ తక్కువ తేడాలేక
మన అందరం ఒక్కటనే "మంచి మనీషి"
...ఇంట్లో పనిమనుషులు ఇచ్చేటి గౌరవం
ఆమె...కమ్మని తిండి పెట్టి కడుపు
నింపడమే కాదు మధురమైనమాటలతో
మనసు నింపడం తెలిసిన "మాతృమూర్తి"
...ఇంటికి వచ్చే అతిథుల అభినందన
ఆమె...ఏ ఆర్థిక సహకారానికైనా ఏ చిన్న
ఆపదవచ్చినా ఆదుకునే "ఆత్మబంధువు"
...బంధువుల నుండి ప్రశంసల వెల్లువ
ఇందరి మనసులను గెలిచిన
ఇందరి హృదయమందిరాల్లో వెలసిన
నిలిచిన ఆమె..."ఒకే ఒక వ్యక్తి"
"కాదు కాదు... ఒక శక్తి"
"కాదు కాదు... ఒక దేవత"
ఆమె ఎవరో కాదు బ్రహ్మకు ప్రతిరూపమైన
"మనందరికి జన్మనిచ్చే మన అమ్మే"
ఇవన్నీ "అమ్మ అవతారాలే" దశావతారాలే
"అవతారమూర్తి అమ్మకు" ఇదే నా "అక్షరాంజలి"



