Facebook Twitter
చురుకైన చూపులు....

కళ్ళని ప్రశ్నిస్తాయి
కనురెప్పలు మూస్తే
చూపెక్కడిదని ?
కళ్ళు తెరిచినా
కబోదికి చీకటి తప్ప
వెలుగెక్కడిదని ?
కానీ ఎన్ని చూపులో?
ఎన్ని విభిన్నమైన
విచిత్రమైన వింతచూపులో ?

గుండ్రని అందమైన
గులాబీపువ్వు మాటున
గ్రుచ్చుకునే ముళ్ళున్నట్టే
ఏ చూపులో ఏ అర్థం
దాగివుందో ఎవరికెరుక ?

కొన్ని ఆకలి చూపులు
కొన్ని ఆశల చూపులు
కొన్ని అల్లరి చూపులు
కొన్ని కామపు చూపులు
కొన్ని అమాయకపుచూపులు

కొన్ని కోరచూపులు
కొన్ని ఓరచూపులు
కొన్ని కొంటె చూపులు
కొన్ని జాలి చూపులు
కొన్ని విషపు చూపులు
కొన్ని పాపపు చూపులు

చూపులేవైనా అంతరంగాన
తొంగిచూస్తేనే ఆ చూపుల
అంతరార్థం అర్థమయ్యేది
కత్తితో కాదు కంటిచూపుతో
చంపేస్తానంటారు నిజమేనేమో

అయితే కొన్ని చూపులు
కన్నీటి దారల్ని వర్షిస్తాయి
కొన్ని చూపుల మాటున
ఆరని అగ్నిజ్వాలలుంటాయి
కొన్ని చూపుల్లో నిశ్శబ్దం
అగ్నిపర్వతంలా బద్దలౌతుంది
కొన్ని చూపుల్లో తరగని
మూగవేదన కనిపిస్తుంది

ఔనిది నిగ్గుతేలిన నిజం
చూపులు నిష్కల్మషమైనవైతే
హృదయం పరిశుద్ధమైనదైతే 
జీవితం సుందర నందనవనమే
చూపులు పాపపంకిలమైననాడు
బ్రతుకంతా అంతులేని విషాదమే
కమ్ముకొంటుంది...గాఢాంధకారమే