Facebook Twitter
శోభనం కన్న...హనీమూన్ మిన్న

ఏడడుగులు నడిచాక
మూడుముళ్లతంతు ముగిశాక
నాటి శోభనంరాత్రి కన్న
ఈ విహారయాత్రలే
ఈ హనీమూన్ రాత్రులేమిన్న
ఇక్కడ ప్రతిరాత్రి
మందార మకరంద భరితమే
సతతహరితమే తేనేపూరితమే

చెప్పుకోవడమే ఊసులు
విప్పుకోవడమే మనసులు
కప్పుకోవడమే తనువు దుప్పట్లు
తీరని ముచ్చట్లు ప్రకృతి చప్పట్లు

ఎంతటి స్వేచ్ఛ ! ఎంతటి స్వాతంత్రం !
ఆ పదాలకర్థం ఆ వణికే పెదవులకు
తేనెలూరే ఆ బిగికౌగిలిలో తెలిసేదిక్కడే

మదిలో ప్రేమపుష్పాలు‌ పెంచుకునేదిక్కడే
ఎదలో బాధలను భావాలను పంచుకునేదిక్కడే

ముందు ముందు విందుభోజనాలకి
వంటలో మెలుకువలు ‌నేర్చుకునేదిక్కడే

చింతలు చీకాకులులేని
కన్నీళ్ళు కష్టాలురాని చక్కనైన
పచ్చనికాపురానికి శ్రీకారం చుట్టేదిక్కడే

విడాకులు పుచ్ఛుకోకుండా
వివాహబంధాలు విచ్చిన్నమైపోకుండా
వినూత్నమార్గాలను ఆశతోఅన్వేషించేది
సమస్యలనెదుర్కొనే శక్తిని పొందేదిక్కడే

అపార్థాలను అర్థంలేని అనుమానాలను
అసూయద్వేషాలను సమాధి చేసేదిక్కడే
అనురాగ గోపురానికి పునాది వేసేదిక్కడే

ఈ హనీమూన్ మధుర క్షణాలను
నిత్యం గాయత్రీమంత్రాల్లా జపించాలని
ఆనందంగా ఆదర్శంగా నవ్వుతూ చిలకా
గోరింకల్లా జీవించాలని తీర్మానాలు చేసేదిక్కడే

పదికాలాలపాటు పచ్చగా కలిసిమెలిసి కలతలు

కలహాలులేక కష్టాలు‌ కన్నీళ్ళు రాక సహనంతో
సర్దుబాటుగుణంతో సుఖంగా ప్రశాంతంగా హాయిగా
గూటిలోగువ్వల్లా బ్రతకాలని కోటికలలు కనేదిక్కడే

హనీమూన్ రాత్రులు వెన్నెల‌సంతకం‌‌చేసేదిక్కడే
పుట్టబోయే బిడ్డలకు పునాది రాళ్ళు వేసేదిక్కడే
ఇక్కడే.........ఇక్కడే.........ఇక్కడే.........ఇక్కడే