Facebook Twitter
ఏమౌతుందే చెల్లి?

అష్టకష్టాలు పడి
అప్పులెన్నోచేసి
పేరాశతో పెంచి పెద్దచేసిన
అమ్మనాన్నల మాటలు వినకుంటే
ఏమౌతుందే చెల్లి?
అక్కా మన బ్రతుకు
కుక్కలు చించిన విస్తరి అవుతుంది
ఆపై నలుగురిలో
నవ్వులపాలు కాక తప్పదు
నరకయాతనను
అనుభవించక తప్పదు

కోటి ఆశలు పెట్టుకుని
కమ్మని కలలెన్నోకని
కష్టపడి పెంచి పెద్ద చేసిన
కన్నవారి మాట కాదంటే
ఏమౌతుందే చెల్లి ?
అక్కా మన జీవితం
ఆరని అగ్నిగుండమౌతుంది
ఆపై ఒంటరిగా బ్రతకక తప్పదు
కంటతడి పెట్టక తప్పదు
రోజు కన్నీరు కార్చక తప్పదు

కార్పోరేట్ చదువులు చదివించి
కంప్యూటర్ ఉద్యోగం ఇప్పించి
అమెరికా అల్లుడికి అడిగినంత
కట్నమిచ్చి అంగరంగ వైభవంగా
పెళ్ళి చేసి అత్తారింటికి పంపే
తల్లిదండ్రుల మాటలు వినకుంటే
ఏమౌతుందే చెల్లి?
అక్కా మన కాపురం ఒక్క ఏడాదికే
ముక్కలౌతుంది
నడిసంద్రంలో నావలా మునిగిపోతుంది
ఆపై మన బ్రతుకు
ముందు నుయ్యి వెనుక గొయ్యి అవుతుంది

అందుకే మనం
కమ్మని కలలు కందాము
కానీ, అమ్మానాన్నలమాట విందాము
కన్నవాళ్ళే కనిపించే దేవుళ్ళని అందాము
నిర్భయంగా నిశ్చింతగా నిజాయితీగా వుందాము