ఓనా ప్రియ సాహితీమిత్రులారా !
నా కవితలు
మీ హృదయాలను కదిలిస్తే...
మీ మనసులను పరవశింపచేస్తే...
తప్పుచేసిన వారికి కనువిప్పు కలిగిస్తే...
కారు చీకటిలో కాంతి రేఖలైతే...
వెలుగులను పంచే వెన్నెల కాగడాలైతే...
చదవండి!స్పందించండి! అభినందించండి!
ఓనా ప్రియ సాహితీమిత్రులారా !
నా కవితలు
చింతల చీకట్లను
చీల్చే వెలుగు కిరణాలైతే...
రామబాణాలైతే...రక్షణ కవచాలైతే...
తరతరాలుగా అణిచివేతకుగురైన...
బానిసత్వానికి బలైపోయిన...
సాంఘిక రుగ్మతలతో చితికిపోయిన...
అమాయకులకు అభాగ్యులకు
కరదీపికలైతే...చైతన్య జ్వాలలైతే...
చదవండి!స్పందించండి!అభినందించండి!
ఓనా ప్రియ సాహితీమిత్రులారా !
నా ఈ కవితలు
కావు కావుమని అరిచే
కాకమ్మ కబుర్లు కావనిపిస్తే...
కొంచం సందేశాన్ని పంచే
కొంత ఆహ్లాదాన్ని అందించే
కొమ్మల్లో కోయిలమ్మల
కుహు కుహు రాగాలనిపిస్తే...
చదవండి!స్పందించండి!అభినందించండి!
ఓనా ప్రియ సాహితీమిత్రులారా !
నా కలలనుండి నా కలంనుండి
జాలువారిన నా కవితలు
విజ్ఞానదాయకం..వినోద భరితం
సందేశాత్మకం...స్పూర్తి మంత్రం
నవసమాజ నిర్మాణానికి...
పటిష్టమైన పునాదులనిపిస్తే...
చదవండి!స్పందించండి!అభినందించండి!
ఓనా ప్రియ సాహితీమిత్రులారా !
నిజానికి నా ప్రతికవిత
ఆరని నా ఆశాదీపం...
నా ఆలోచనామృతం...
నా ఆత్మ దర్శనం...
నా ఆత్మ సాక్షాత్కారం...
నా కవిత్వం తాడిత పీడిత
బడుగు బలహీవర్గాలకొక భరోసా...
ఒక పూలబాట...
ఒక కంచుకోట...వారి చేతిలో ఒక తూటా...



