పిల్లగాలులు అల్లరిచేసే వేళ
గులాబీలు గుభాళించే వేళ
మరుమల్లెలు మత్తెక్కించే వేళ
చల్లనిచంద్రుడు తొంగిచూసే వేళ
నిండుపున్నమిలో పండువెన్నెలలో
కొత్తజీవితాన్ని గుర్తు చేసుకునేవేళ
గుండెలకు ఇద్దరు హత్తుకునేవేళ
బ్రతుకు బంగారమయ్యే వేళ
కన్నకలలెన్నో సంతోష సాగరాన
అలలై ఎగసిఎగసిపడే వేళ,మేడపైన
మెత్తని పరుపు మత్తెక్కించే వేళ
మురిపించే వేళ, మైమరపించే వేళ
ఊహల ఉయ్యాలలో ఊరేగే వేళ
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యే వేళ
గ్లాసులోని చిక్కనిపాలు వెక్కిరించే వేళ
అగరు వత్తులు ఆశీర్వదించే వేళ
కమ్మని కలలుకనే వేళ
మత్తుగా ఎదపై ఒరిగే వేళ
వెచ్చని కౌగిలిలో కరిగే వేళ
శృంగారం శృతిమించని వేళ
కోటి కోరికలతో రగిలిపోయే వేళ
పడుచుజంటలు పొంగిపోయే వేళ
హద్దుమీరక నిద్దురరాని ఆ ఇద్దరు
ముద్దుల యుద్దానికి సిద్ధమయ్యే వేళ
తరువుకు లతల్లే అల్లుకు పోయేవేళ
తనువులు రెండు తగవులాడుకొనే వేళ
ఇద్దరు ఇక ఏకమై ఒక లోకమై పోయేవేళ
స్వర్గలోకాల్లో విహంగాలై విహరించే వేళ
నిశ్శబ్దం నిద్దుర పోవును గాక!
శోభనం రాత్రి శోభిల్లును గాక !
ఆ నూతన వధూవరులను
"శతమానం భవతీ" అంటూ
దివినుండి దేవతలు దీవించెదరు గాక !



