నీవు మురళివై
గోపికలనుమురిపిస్తే
నేను చుక్కల్లో చంద్రుడినై
చల్లని వెన్నెల కురిపిస్తా..!
నీవు ప్రేయసి ప్రియులకు
తీయని ప్రేమపాఠాలు నేర్పిస్తే
నేను అస్తమించే సూర్యుడనై
చిమ్మ చీకట్లను కుమ్మరిస్తా..!
ఆ నిశిరాత్రి వేళలో
ఆ మత్తులో ఆ మాయలో
నగ్నంగా తిరిగే ఆ భగ్నప్రేమికుల
రాగ రంజిత రసమయ జగత్తుకు
నేను రాచబాటలు వేస్తా..! రంగులద్దుతా..!
నీవు కొమ్మల్లో కోయిలవై
కమ్మని గీతాలు ఆలపిస్తే
నేను పురివిప్పిన నెమలినౌతా
నాగునౌతా నటరాజునౌతా నాట్యం చేస్తా...!
నీవు దొంగవైతే కొల్లేటి కొంగవైతే
చెరువులో చేపలను చెరపడితే...
నేను వేటగాడినై నిన్ను వెంటాడుతా
నీ రెక్కలు విరిచి నీకు చుక్కలు చూపిస్తా..!
నీవు లోతుగ వెనుక గోతులు తీసి కొంపలార్పే కోతివైతే
నేను బుసలు కొట్టి నిన్ను కసిగా కాటేసే కోడెనాగునౌతా
నీవు మాటువేసి పసిమొగ్గల్ని కాటేసే కామాంధుడివైతే
నేను నీ మెడకు గొడ్డలినౌతా నీ గొంతుకు కొడవలినౌతా..!



