Facebook Twitter
ఆ రెండు అడక్కు?

ఆకాశంలోఎగిరే పక్షులకు తెలుసు

ఆహారం ఎక్కడ దొరుకుతుందో...

 

అడవిలో తిరిగే మదపుటేనుగులకు తెలుసు

మంచినీటి సరస్సులెక్కడుంటాయో...

 

చెరువు గట్టుకుచేరి తొంగి తొంగి చూసే

కొంగలకు తెలుసు చేపలెక్కడ చిక్కుతాయో...

 

ఎక్కడోవున్న రాబందులకు తెలుసు 

చచ్చిన కళేబరాలెక్కడ పడివుంటాయో...

 

పుట్టలోని చలిచీమలకు తెలుసు

ఎక్కడ చెక్కెర లేదా బెల్లంముక్క పడివుందో...

 

రాత్రులందు రెక్కీలు నిర్వహించే దొంగలకు తెలుసు

ఏఇళ్ళు దోచుకోవచ్చో ఎలాఈజీగా తప్పించుకోవచ్చో

 

దొరల్లా తిరిగే దోపిడి దొంగలకు తెలుసు 

దోచుకున్నది ఏస్విస్ బ్యాంక్ లో ఎలాదాచుకోవచ్చో...

 

కోర్టులోని న్యాయమూర్తులకు తెలుసు

ఎవరు నేరస్తులో ? ఎవరు నిర్థోషులో?...

 

పోలీసు బాసులకు తెలుసు

హత్యచేసింది ఎవరో ఆ హత్యవెనుక

ఏ అధికారి అదృశ్య హస్తముందో...

 

కానీ...ఈ మనిషికి తెలియనివి రెండే

ఒకటి...రేపు తనకు పుట్టబోయే బిడ్డా 

ఆడా మగా అమ్మాయా‌ అబ్బాయాయని...

 

రెండు... రేపటిరోజున మృత్యువు 

ఏరూపంలోవచ్చి తనను కబళిస్తుందోనని...