Facebook Twitter
ఆ చిరునవ్వులో ఏముంది?

ఆ చిరునవ్వులో ఏముంది ?
మనోవేదనకు మందుంది
సకల సమస్యలకు పరిష్కారముంది
మేను పులకరించే వేణు గానముంది
చింతను చీకటిని తరిమేసే చిరుదివ్వెవుంది
అమృతాన్ని చిలకరించే అక్షయపాత్రవుంది

ఆ చిరునవ్వులో ఏముంది ?
కిలకిల నవ్వే నది వుంది
గిలగిల పారే సెలయేరు వుంది
జలజల దూకే జలపాతముంది
అందాల అలలు ఎగిసి ఎగిసిపడే
అంతులేని ఆనంద సాగరముంది

ఆ చిరునవ్వులో ఏముంది ?
ఎంత తిలకించినా తనివితీరని
ఏడు రంగుల ఇంద్రధనస్సుంది
శాంతి సౌభాగ్యాల సంపద వుంది
మాయని గాయాలకు మందుంది
ఉరకలు వేసే ఉల్లాసం,ఉత్సాహముంది

ఆ చిరునవ్వులో ఏముంది ?
సూర్యోదయముంది,చల్లని వెన్నెల వుంది
ఆకాశవీధిలో ప్రకాశించే ధృవతార వుంది
అసలా చిరునవ్వులో లేనిది ఏముంది?...
ఒక చక్కని చిరునవ్వునవ్వి సాధించలేనిది...
పొందలేనిదంటూ ఏమైనావుంటుందా? చెప్పండి...