Facebook Twitter
నేడే తెలిసింది ఓనిండునిజం ...

పాముతో కలిసి
వేడివేడి పాలు త్రాగాలని
పాము పడగ నీడన
ప్రశాంతంగా పవళించాలని
కమ్మని కలలు గనే
ఆ అమాయకపు కప్పలకు
తెలియదు పాపం ఓ పచ్చినిజం

తమకు ప్రాణగండమున్నదని
తమకు పాముకు బద్దవైరమని
తాము పాములకు ఆహారమని

కప్పలు పదివేలేకమైనా
ఒక్కపామునైనా సంహరించలేవని
చీమలు పాములకు శతృవులని
ముల్లును ముల్లుతోనే తియ్యాలని
ఆ అమాయకపు కప్పలకు
తెలియదు పాపం ఒక పచ్చినిజం

కసిపట్టి బుసలు కొట్టే కోడెనాగుల
విషపు కోరల నుండి
విముక్తి లభించాలంటే
కప్పలన్నీ చలిచీమల సహకారం
తప్పక తీసుకోవలసిందేనని
ఆ అమాయకపు కప్పలకు
నేడే తెలిసింది ఒక నిండునిజం