Facebook Twitter
నీకు నాకేం తెలుసు ! నిమ్మకాయ పులుసు !!

పచ్చని...ఆ పండ్లచెట్టును...
నవ్వుతూ గొడ్డలితో నరికెయ్యకు
మున్ముందు...ఆ పండ్లచెట్టు...
ఇంకెన్ని తియ్యని ఫలాలను
ఇంకెంత మందికి అందించాలో
ఎవరికి తెలుసు ?
విత్తనం నాటిన ఆ వ్యక్తికి
పెంచిన ఆ ప్రకృతికి తప్ప...

చక్కని...ఆ పూలమొక్కను...
మొగ్గలోనే త్రుంచివెయ్యకు
మున్ముందు...ఆ పూల మొక్క...
ఇంకెన్ని అందమైన సుందరమైన
గుభాళించే పూలను పూయాలో
ఎవరికి తెలుసు ?
నారుపోసి నీరుపోసి ప్రేమతో
పెంచిన ఆ తోటమాలికి తప్ప...

బిస్కట్లు ఆశచూపి...ఆ పసిబిడ్డను...
కామాంధుడివై కసిగా‌ కాటెయ్యకు
చిన్ననాడే ఆమె బంగారుభవిష్యత్తును
చిదిమెయ్యకు ఛిద్రం చెయ్యకు
రేపు...ఆ చిట్టితల్లి... పెరిగి పెద్దదై
ఎవరికి భార్యకావాలో
ఎంతమంది ప్రయోజకులైన
భారతమాత ముద్దుబిడ్డల్ని కనాలో
ఎవరికితెలుసు ?
నిన్నకని,నేడు కమ్మని కలలుకనే
ఆ అమాయకపు అమ్మనాన్నలకు
ప్రాణం పోసిన ఆ పరమాత్మకు తప్ప...

ఆదిలోనే...ఆ చిరుదీపాన్ని...
ఆర్పివేయకు మున్ముందు,
వెలిగే...ఆ దీపం... చీకటిలో ఉన్న
ఇంకెన్ని దీపాలను వెలిగించాలో
ఇంకెంతమందికి వెలుగుల్ని పంచాలో 
ఎవరికి తెలుసు ?
వేయి ఆశలతో...ఆ దీపాన్ని...
వెలిగించిన ఆ వ్యక్తికి తప్ప...

మార్కుల పేర ర్యాంకుల పేర
మధ్యలోనే...ఆ విద్యార్థిని...
ఆవేశంతో ఆత్మహత్యకు పురికొల్పకు
మరణానికి చేరువయ్యేలా మంత్రించకు
విజేయుడై...ఆ విద్యార్థి... మున్ముందు
ఇంకెంతమందికి మార్గదర్శకుడు కావాలో
మర్రిమ్రానులా మారి ఇంకెంతమందికి
నీడనివ్వాలో ఎవరికి తెలుసు ?
భవిష్యత్తును నిర్ణయించే ఆ భగవంతునికి తప్ప...