Facebook Twitter
పోరాడితేపోయేదేముంది చెప్పండి?

ఓ బహుజన బిడ్డలారా! మీరు
బావిలో కప్పల్లాగ
గుడ్డిగా దూకే గొర్రెల్లా
ఆకులు మేసే మేకల్లా
తోకలు ఊపే కుక్కల్లా
బెదురు చూపుల జింకల్లా
గొడ్డు చాకిరి చేసే గాడిదల్లా
పంజరాల్లోపక్షుల్లా బ్రతక్కండి !

గర్జించే సింహాల్లా
గాండ్రించే పులుల్లా
బుసలు కొట్టే కోడెనాగుల్లా
ఘీంకరించే మదపుటేనుగుల్లా
ఎగిరే తారా జువ్వల్లా
రగిలే నిప్పురవ్వల్లా బ్రతకండి !

ఓ బహుజన బిడ్డలారా! మీరు
ఒకరిపై ఆధారపడినంత కాలం
మీరు అనాధలే....
అడుగునుండే బడుగువర్గాలే
అణగారిన అణద్రొక్కబడిన
అమాయకులే....
ఓ పీడిత తాడిత ప్రజల్లారా !
పిడుగుల్లా మారండి ! పిడికిలి
బిగించి ముందుకు దూకండి !

ప్రశ్నించండి !
ప్రతిఘటించండి !
ప్రచండశక్తితో సమిష్టిగా
పులుల్లాగ పోరాడండి.!
పోరాడితే పోయేదేముంది చెప్పండి?
వెయ్యేళ్ళ మీ బానిసత్వం తప్ప
కానీ తప్పక వస్తుంది
సమాజంలో మీకు సమానత్వం 

మరవకండి ! మరువకండి !
కలనైనా మరవకండి....!
ఆకులుమేసే అమాయకపు
మేకల్నితప్ప...
పులుల్ని సింహాలనెవరూ
పూజకు బలివ్వరన్న...
అంబేద్కర్ అమృతవాక్కుల్ని
కలనైనా మరవకండి..........