Facebook Twitter
ఆ ఆలోచనే అభాగ్యునికి ఆక్సిజన్...

పుట్టినప్పటి నుండి
కష్టాలు కాటికి దారి
చూపిస్తూనే ఉన్నాయి

పేదరికం పేగులను
పెనవేసుకుపోయింది

దహించే ఆకలిని
సహించడమెలాగో
పూరిగుడిశలో
మూలనున్న చల్లని
నీటికుండకు తెలుసు

కష్టాలన్నీ కట్టకట్టుకొని
పిడుగుల్లా అడుగుల్లో
పడి పిండైపోతున్నాయి

ఎక్కడో మూలిగే మనసు
ధైర్యాన్ని దానం చేస్తుంది

ప్రపంచమంతా ఎంతో వెలుగున్నా
జీవితంలోని చీకటిశవాన్ని మోసుకుంటూ
పశ్చమదిక్కుకు సూర్యుడు పారిపోయాడు

చింతల చితిమంటల్ని చిరునవ్వుతో
ఆర్పేసి ఒకే ఒక్క ఆశను ఆరనిజ్యోతిగా
అంతరంగాన వెలిగించుకుంటున్నాడు

ఈ లోకాన ఏది ఉన్నా లేకున్నా దైవమొక్కడు
తనకుతోడన్న ఆలోచనే ఆ అభాగ్యునికి ఆక్సిజన్