కొందరు మనుషులు
శ్రమచీమల దండై
ఒళ్ళంతా పాకినప్పుడు
సవాళ్ళు సర్పాలై
బుసలుకొట్టినప్పుడు
భయపడతారు పారిపోతారు
ఎంతటి...పిరికితనం
కొందరు మనుషులు
కష్టనష్టాలను భరించలేక
అక్రమ మార్గాలు వెతుకుతారు
ఆత్మాహుతికి సిద్ధమౌతారు
ఎంతటి... అవివేకం
కొందరు మనుషులు
అవినీతిని ఆశ్రయిస్తారు
శ్రమపడకుండా విజయాన్ని
సాధించాలంటారు
కష్టపడకుండా ఫలితాన్ని
కోరుకుంటారు
ఎంతటి...అమాయకత్వం
కొందరు మనుషులు
మానవత్వాన్ని మరిచి
సభ్యసమాజం తలదించుకునేలా
అమానుషంగా ప్రవర్తిస్తారు
అల్పసంతోషులుగా జీవిస్తారు
బానిసలుగా బ్రతకుతారు
ఎంతటి...అజ్ఞానం
అందుకే ఓమనిషీ నిజం తెలుసుకో
పిరికివాళ్ళు ప్రతిక్షణం మరణిస్తారు
నీవు ఆ ఓటమి కూటమిలో చేరకు
విజయమో వీరస్వర్గమో తేల్చుకునే
వీరుల అడుగుల్లో అడుగులు వేయ్
విశ్వవిజేతల బాటలో పయణించు
ఈ జీవితమే ఒక పోరాటం నీతిగా
నిజాయితీగా నిర్భయంగా బ్రతుకు



