విత్తనం నాటితేనే మొక్క
మొక్క ఎదిగితేనే చెట్టు
చెట్ల ఆకులు రాలితేనే
చిగురులు
చిగురిస్తేనే పిందెలు
పిందెలు వస్తేనే పూలు
పూలు పూస్తేనే కాయలు
కాయలు పండితేనే
కడుపు నిండేది ఆకలి తీరేది అందుకే
ఆగాలి మనం...కొంతకాలమాగాలి...
పకపకమని నవ్వేపాప
చకచకా నడవాలంటే....
ఊయల్లో ఊగేపాప దిగి
ఉరుకులు పరుగులు పెట్టాలంటే...
ముసిముసి నవ్వులు నవ్వేపాప
ముద్దు ముద్దుగా మాట్లాడాలంటే....
ఆగాలి మనం...కొద్దికాలమాగాలి...
తాను తల్లికావడానికి ప్రతిమహిళ
తొమ్మిది నెలలాగినట్టు...
పడమట సూర్యుడు అస్తమించాక మరో
సూర్యోదయానికి పన్నెండు గంటలాగినట్టు...
నేడు గోడకు తగిలించిన క్యాలెండరు
మార్చాలంటే పన్నెండు నెలలు ఆగినట్లు...
ఆగాలి మనం...కొద్దికాలమాగాలి...
ఆకులురాలే సమయంలో ఆకలితీరలేదని
చెట్టును తిట్టి గొడ్డలితో కొట్టిలాభమి ?
మేఘాలు కరగలేదని వర్షం కురవలేదని
దాహం తీరలేదని దయలేనివాడని
ఆ దైవాన్ని నిందించి ప్రయోజనమేమి?
ఆగాలి మనం...కొంతకాలమాగాలి...
తెలుసుకోవాలి ప్రకృతిధర్మం సృష్టిమర్మం
పొందాలంటే ప్రకృతి వరాలు...
అందుకోవాలంటే ఆ పరమాత్మ దీవెనలు
ఆగాలి మనం...కొంతకాలమాగాలి...
ఎప్పుడూ ఏదీ ఇవ్వబడునో
అప్పుడది అడగకున్నా ఇవ్వబడును
అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ
మంచికని అనుకోవడమే మనిషి పని
అంటూ ఒక మహాకవి సందేశమిచ్చినట్టు...



