ఓ మనిషీ !
ఒక చిన్న విన్నపం !
ఈ అవని మనకు ఓ అద్దె కొంప
ఏ రోజైనా కన్ను మూయక తప్పదు
ఆత్మను పరమాత్మకు అద్దెగా చెల్లించి
ఈనేలపై ఇల్లు ఖాళీ చేయక తప్పదు
అందుకే నీవు వెళ్ళే ముందుర
ఒక్క దీపమైనా వెలిగించి వెళ్లిపో !
ఒక పాదముద్రనైనా మిగిలించి వెళ్ళిపో !
ఒక్కరికైనా నీ చిరునామా చెప్పి వెళ్ళిపో !
ఒక్కరిలోనైనా చైతన్యాన్ని రగిలించి వెళ్ళిపో !
ఒక్కరినైనా విజ్ఞానజ్యోతిగా వెలిగించి వెళ్ళిపో !
ఒక్కరికైనా మంచిని మానవత్వాన్ని పంచి వెళ్ళిపో !
ఒకరి జీవితాన్నైనా పచ్చనిచెట్టుగా మార్చి వెళ్ళిపో !
ఒక్కరి కంటిలోనైనా కన్నీటిదారలను తుడిచి వెళ్ళిపో !
ఒక్కరి మనసులోనైనా మాలిన్యన్ని తొలగించి వెళ్ళిపో !
ఒకరి ముఖంలోనైనా చిరునవ్వుదీపం వెలిగించి వెళ్లిపో !
ఒక్కరిలోనైనా నీవు ఒక మధురజ్ఞాపకంగామారి వెళ్ళిపో !
ఒక్కరి గుండెగుడిలోనైనా దైవమై కొలువుండేలా వెళ్ళిపో !
ఆపై నీ జన్మధన్యం ! నీ చరిత చిరస్మరణీయం !
నీబ్రతుకు భావితరాలకు ఆదర్శం ! ఎంతోస్పూర్తిదాయకం !
ఒక మనిషి మహాత్ముడంటే?
ఆ మనిషిలో మానవత్వముండాలి
ఒక మనిషి దేవుడంటే...
ఆపదలో ఎందరినో ఆదుకొని ఉండాలి
గొప్ప దాతంటే...
గుప్తదానాలెన్నోచేసి ఉండాలి
గొప్ప పండితుడంటే...
బృహత్ గ్రంధాలెన్నో రచించి ఉండాలి
గొప్ప చిత్రకారుడుంటే...
రవివర్మలా వర్ణచిత్రాలెన్నో చిత్రించి ఉండాలి
కళాఖండాలెన్నో సృష్టించి ఉండాలి
మహా గాయకుడంటే...
ఒక ఘంటసాలలా ఒక బాలులా
ఎన్నో ఏళ్ళు కఠోరమైన
సంగీత సాధన చేసి వుండాలి
ఎన్నెన్నో మరచిపోలేని
మధురమైన గీతాలు ఆలపించి ఉండాలి
ఒక నటుడు
నటసార్వభౌముడంటే...
ఎన్నో చిత్రాలలో తన అద్వితీయ
నటనతో ప్రేక్షకులను అలరించి ఉండాలి
గొప్ప మానవతావాదంటే...
మానవీయ విలువలతో
ఎన్నెన్నో సత్కార్యాలను చేసి ఉండాలి
గొప్ప ఉపన్యాసకుడంటే...
ఎన్నో సభల్లో సమావేశాల్లో
వివేకానందుడిలా శ్రోతలను
ఉర్రూతలూగించే గొప్పవక్తయై వుండాలి
కోటీశ్వరుడంటే...
కోటాను కోట్లు ఆర్జించి ఉండాలి
బిల్ గేట్స్ లా...
వారెన్ బఫెట్ లా...
మన ముఖేష్అంబానిలా...



