Facebook Twitter
అతడు అడవిని జయించాడు

అతడు అడవిని జయించాడు!

 


తెలుగు భాషలోని సాహిత్యం గురించి చాలామందికి చాలా అపోహలే ఉన్నాయి. ప్రపంచస్థాయిలో రాయగల రచయితలు మన మధ్య లేరనీ, ఒకవేళ ఎవరన్నా అలాంటి రచన చేస్తే, దాన్ని ఆదరించేంత పరిణతి తెలుగు పాఠకులకు లేదని... ఇలాంటి సందేహాలు చాలానే వినిపిస్తుంటాయి. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా ఒకటే జవాబు వినిపిస్తుంది- ‘అతడు అడవిని జయించాడు’ రచనే ఆ సమాధానం.

 

ఎప్పుడో 1984లో ఓ చిన్నధారావాహిక రూపంలో వచ్చిన రచన ‘అతడు అడవిని జయించాడు’. ధారావాహికగా వస్తున్న సమయంలో చాలామంది ఈ రచనను అంతగా ఆమోదించలేదు. ఇందులో కనిపించే నేపథ్యం సంప్రదాయ పాఠకులకు చాలా చిత్రంగా తోచింది. కానీ తెలుగు సాహిత్యంలో ఈ రచన ఏదో కొత్తదనాన్ని తీసుకువస్తోందనే అశ మాత్రం చాలామందికి కలిగింది. ఇక దీన్ని ఒక నవలగా ముద్రించిన తర్వాత, దాని విజయానికి తిరుగులేకుండా పోయింది. 1988లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దీన్ని ఉత్తమ నవలగా ఎంపిక చేయడంతో, కావల్సినంత ప్రచారమూ దక్కింది. ఈ నవలను ఓ చలనచిత్రంగా రూపొందించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి.

 

అతడు అడవిని జయించాడులోని కథ చాలా సామాన్యమైంది. సంస్కారవంతులమని భావించేవారు ఇలాంటి నేపథ్యాన్ని గురించి ఆలోచించడానికే జంకుతారు. ఒక ముసలివాడు అడవిలో తప్పిపోయిన తన పందిని వెతుక్కుంటూ వెళ్లడమే ఈ కథలోని నేపథ్యం. ముసలివాడికి వయసు దాటిపోయింది, పైగా జ్వరంతో శరీరం బలహీనపడిపోయింది. కానీ తన పందులే అతని సర్వస్వం. వాటి క్షేమం కోసం అతను ఎలాంటి సాహసాన్నయినా చేసేందుకు సిద్ధం. అందుకే అడవిలో తప్పిపోయిన తన పందిని వెతుక్కుంటూ ‘అస్తమిస్తున్న సూర్యునిపై దండెత్తిన వానివలె’ అతను బయల్దేరతాడు.

 

అడవిలోకి చేరుకున్న తర్వాత ముసలివాడికి ఎదురయ్యే అనుభవాలతో పుస్తకం అంతా నిండిపోయి ఉంటుంది. సూర్యాస్తమయం వేళకి అడవికి ముసలివాడు అడవికి బయల్దేరడంతో మొదలయ్యే కథనం, సూర్యోదయం వేళకి అతని తిరిగి తన గుడిసెను చేరుకోవడంతో ముగుస్తుంది. అలాగని ఇందులో అద్భుతమైన సాహసాలు ఉంటాయని కాదు. ఒక మనిషి తనకు ఎదురైన పరిస్థితులను అంచనా వేస్తూ ఎలా ఆ రాత్రిని గడిపాడు అన్నదే ఇందులోని కథనంగా సాగుతుంది.

 

ముసలివాడు అడవిలో ఎలాగొలా తన పందిని కనుక్కొంటాడు. కానీ దాని దగ్గరకు అతను చేరలేడు. ఎందుకంటే అప్పుడే పిల్లల్ని ఈనిన ఆ జంతువు మహాక్రూరంగా ఉంటుంది. దానికి తనామనా బేధం ఉండదు. తన జోలికి ఎవరు వచ్చినా కూడా, చీల్చి చెండాడేందుకు సిద్ధంగా ఉంటుంది. ఎవరో దాకా ఎందుకు తను ఉంటున్న దాపు దగ్గరకి వచ్చిన ముసలివాడి మీదే అది తీవ్రంగా దాడి చేస్తుంది. చావు తప్పి కన్నులొట్టబోయిన ముసలివాడు దగ్గరలో ఉన్న చెట్టెక్కి తన ప్రాణాలు కాపాడుకుంటాడు. ఇహ అక్కడి నుంచి ముసలివాడిది మరో కష్టం. పందినీ, దాని పిల్లలనీ క్రూరమృగాల నుంచి కాపాడుకోవాలి... కానీ చెట్టు దిగడానికి వీల్లేదు.

 

అతడు అడవిని జయించాడులోని ఇతివృత్తం, పాత్రలు వినడానికి చాలా సాదాసీదాగానే కనిపిస్తాయి. కానీ ఒక అద్భుతమైన రచన చేయడానికి కావల్సినన్ని హంగులన్నీ ఇందులో ఉన్నాయి. కార్యోన్ముఖుతని నిరూపించునేందుకు ఓ సందర్భం, ఆ సందర్భంలో అనేక సందిగ్ధాలు. వీటన్నింటి నుంచి జనించే జీవితసత్యాలు... ఇవన్నీ ఈ రచనలో కనిపిస్తాయి. ఇంత జరిగిన తర్వాత ముసలివాడి ప్రయత్నం ఫలిస్తుందని అనుకుంటాం. కానీ అతను అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా రిక్తహస్తాలతో తిరిగిరావడం పాఠకుడికి మింగుడుపడదు. కానీ జీవితం అంటే అంతే కదా! మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. అది ప్రతిసారీ సఫలం కావాలని లేదు కదా.

 

అందుకే ముసలివాడు చివరిలో ‘నేనింతటి యుద్ధం జరిపింది ఈ జడత్వాన్ని పొందడానికేనా?’ అని తనని తాను ప్రశ్నించుకుంటాడు. అంతలోనే ‘నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది నా జీవితంలో చివరి రోజు కాదు... ఈ రోజు నేను విపరీతమైన దురదృష్టాలకు లోనయ్యాను. లెక్కలేనన్ని ఎదురుదెబ్బలు తిన్నాను. ఐనా ఇది నా చివరి రోజు కాదు’ అంటూ తనని తాను సముదాయించుకుంటాడు.

 

కేవలం ఈ నవలే కాదు, కేశవరెడ్డి రాసిన ప్రతి నవలా ఒక అద్భుతమే! మూగవాని పిల్లనగోవి, చివరి గుడిసె, మునెమ్మలాంటి ఎనిమిది నవలలూ తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన స్థానాన్ని సంతరించుకున్నాయి. వీటిలో చాలా పుస్తకాలు ఆంగ్లంలోకి కూడా తర్జుమా అయ్యాయి. వృత్తి రీత్యా వైద్యుడు అయిన కేశవరెడ్డి, మనిషి శరీరం మీదే కాదు... అతని మనసు మీద కూడా అద్భుతమైన పరిజ్ఞానం ఉందని తోస్తుంది ఈ రచనలు చదివితే!

 

- నిర్జర.