Facebook Twitter
తెలుగు లేకపోతే జీవితం వృథా..

తెలుగు లేకపోతే జీవితం వృథా!

 


ఒకప్పుడు సంస్కృతంలో మాట్లాడితే పండితుడు అనుకునేవారు. అందుకని స్థానికులు కూడా బలవంతంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. దేవభాష సంస్కృతం రానురానూ క్షీణించిపోయింది. కానీ ఆ స్థానంలో ఆంగ్లేయుల పెత్తనం మొదలైంది. మొదట తమ వ్యాపార విస్తరణ కోసం వాళ్లే స్థానిక భాషలని నేర్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే వారి వ్యాపారం కాస్తా పెత్తనంగా మారిందో... తమ భాషనే స్థానికుల మీద రుద్దడం మొదలుపెట్టారు. ఇక ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష నేర్చకుంటేనే మనుగడ సాధ్యం అన్న వాదన మొదలైపోయింది. ఆంగ్లం తప్పనిసరే! కాదని ఎవరూ అనడం లేదు. కానీ తొలి ప్రాధాన్యత ఎప్పుడూ మాతృభాషదే కావాలంటున్నారు నిపుణులు. అలా ఎందుకు? అనే ప్రశ్నకు చాలా స్పష్టమైన జవాబులు ఉన్నాయి.

మన జన్యువులలోనే :–  తరతరాలుగా మనం ఒక భాషకి అలవాటు పడి ఉన్నాము. కాబట్టి మన మెదడు కూడా సదరు భాషకి అనుగుణంగానే ఏర్పడుతుందని చెబుతున్నారు. అంటే మాతృభాష మన మెదడులోని సహజసిద్ధమైన హార్డ్‌వేర్ అన్నమాట. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం అంటే... మన సహజమైన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడమే!

తల్లి కడుపులోనే :–  భాష నేర్చుకోవడం తల్లి కడుపులోనే మొదలవుతుందని పరిశోధనలు తేల్చాయి. తల్లి నుంచి వినిపించే శబ్దాలు అతని మెదడులోని భాష నేర్చుకునే భాగాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. తల్లులు లాలిపాటలు పాడటం, కడుపులోని బిడ్డతో మాట్లాడటం వృధా కావనీ... ఆ బిడ్డలోని భాషా నైపుణ్యాన్ని పెంచుతాయని అంటున్నారు. అలా అలవోకగా నేర్చుకుంటున్న భాషని వదిలేసి మరో భాష కోసం ఎగబడం ఎంతవరకు సబబు!

మాతృభాషలోనే నేర్చుకోగలం :–  ఏడాది దగ్గర నుంచి పిల్లలు, తమ మాతృభాషలో ఒకో పదాన్ని నేర్చుకుంటారు. ఆ భాషలోనే తమకి తెలియని విషయాలను నేర్చుకోవడం, తమ భావాలను వ్యక్తపరచడం చేస్తుంటారు. అది పక్కన పెట్టేసి ఆంగ్లంలో ఒకేసారి ఓనమాలతో పాటుగా పద్యాలని, వాక్యాలని నేర్చుకోవడం ఎంత కష్టం! ఇది వారి నేర్పు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒక స్థాయి వరకూ చదువుని మాతృభాషలో నేర్చుకుంటేనే ఉపయోగం అని నివేదికలు తేల్చి చెబుతున్నాయి.

ఏ భాష నేర్చుకోవాలన్నా :–  పునాది సరిగా లేకుండా ఎన్ని అంతస్తులు కట్టినా ఉపయోగం ఏముంది? మాతృభాష మీద పట్టు సాధించకుండా ఇతర భాషలు నేర్చుకోవడమూ ఇంతే! ముందు మాతృభాష మీద ఒక అవగాహన వచ్చినవాడే ఇతర భాషలను సులువుగా నేర్చుకోగలడనీ, అందులో పరిపూర్ణతను సాధించగలడనీ పరిశోధనలన్నీ ఏకరవు పెడుతున్నాయి.

ఎంత సాధించి ఏం ఉపయోగం :–  మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాదు. అతనికంటూ ఒక సంస్కృతిక నేపథ్యం ఉంటుంది. కానీ మాతృభాష నుంచి దూరమైనవాడు ఒంటరిగా మారిపోతాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం అతనికి తోచదు. ఆ ఒంటరితనం తెలియకుండా అతన్ని క్రుంగదీస్తుంది. అందుకే భాషని దూరమైన ఆదిమజాతివారు త్వరగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న పరిశోధన ప్రపంచాన్ని కుదిపేసింది.

జ్ఞానానికి దూరం :–  భాష అంటే తరతరాల జ్ఞానసంపద. భాషకి దూరమైతే ఆ జ్ఞానానికి కూడా దూరమైపోతాం. ఉదాహరణకు మన చుట్టూ ఉండే మొక్కలనే తీసుకోండి. బీపీని తగ్గించే సర్పగంధి, షుగర్‌ని తగ్గించే నేలవేము గురించి ప్రాంతీయ భాషలలో ఉన్నంత తేలికపాటి సమాచారం ఆంగ్లంలో ఉండదు. అంతదాకా ఎందుకు! ‘కాళ్ళాగజ్జీ కంకాలమ్మ వేగు చుక్కా వెలగామొగ్గా’ లాంటి పిల్లల పాటలలో ఉన్న ఆయుర్వేద సూత్రాలను ఎలా మర్చిపోగలం. ఇలా లాలిపాటల దగ్గర నుంచి సామెతల వరకు మాతృభాషలో అద్భుతమైన విజ్ఞానం దాగి ఉంటుంది. దాన్ని మనం చేజేతులారా దూరం చేసుకుంటున్నాం.

చివరగా ఒక్క మాట. మనకి కోపం వస్తే ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెడతాం. బాధ కలిగితే అమ్మా అంటూ మనసుకి సర్దిచెప్పుకొంటాం. మన మనసుకి దగ్గరగా ఉన్న మాతృభాష కావాలా, మన అహంకారాన్ని పెంచి పోషించే ఇతర భాషలు కావాలా! తేల్చుకోవాల్సిందే మనమే!

- నిర్జర