Facebook Twitter
తెలుగు సాహిత్యంలో తొలి మానవవాది ‘కవిరాజు’

మల మల మాడుపొట్ట, తెగ మాసిన బట్ట
కలంత పెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని
జూపకుండా నుత్తల పడిపోయి జీవ రహితంబగు బొమ్మకు
నిండ్లు, వాకిళల్‌ పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధుల నిచ్చమెచ్చెదన్‌.
తిండి, గుడ్డ, నీడ లేని నిరుపేదలను అశ్రద్ధ చేసి, జీవం లేని బొమ్మలకు ఇళ్లు, వాకిళ్లు, పొలమూ, పుట్రా సమకూర్చి, పెండ్లీ, గిండ్లీ చేసే ప్రబుద్ధులను కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి (15 జనవరి 1887-16 జనవరి 1943) తీవ్రంగా నిరసించారు. తమిళులకు పెరియార్‌ రామసామి నాయకర్‌ ఉన్నట్టే, మన తెలుగువారికీ ఒక రామస్వామి ఉన్నారు. ఆయన నాయకర్‌ను వదిలేసినట్టే, ఈయన చౌదరిని వది లేశారు. ఇద్దరూ ఉన్నత శ్రేణి హేతువాదులు. మాన వీయ విలువల్ని నిలుపడానికి ఈ ఇద్దరూ జీవి తాంతం కృషి చేశారు. త్రిపురనేని రామస్వామి జయంతి, వర్ధంతులు ప్రతి సంవత్సరం ఒక్కరోజు తేడాతో వస్తాయి. ఆయనను స్మరించుకుని, ఆయన ఆశయాల్ని నిలబెట్టడానికి మనం నిరంతరం కృషి చేయాలి. మన ముందు తరాల వారిని అందుకు సిద్ధం చేయాలి!
తెలుగు సాహిత్య రంగంలో కవిరాజుది, ఆయన కుమారుడైన గోపీచంద్‌ది గణనీయమైన స్థానం. 1987లో కవిరాజు శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాల బిళ్ల విడుదల చేయగా 24 ఏండ్ల తరువాత ఆయన కుమారుడు గోపీచంద్‌ శతజయంతి సందర్భంగా 2011లో మరో తపాలా బిళ్ల విడుదల చేసింది. భారత ప్రభుత్వం ఇలా ఉన్నత శ్రేణి రచయితలైన తండ్రీ కొడుకుల స్మృతిలో తపాలాబిళ్లలు విడుదల చేయడం చాలా అరుదైన విషయం. ఈ తండ్రీ కొడుకులిద్దరూ హేతువాదులే! హైదరాబాద్‌ టాంక్‌బండ్‌ మీదున్న తెలుగు వెలుగుల విగ్రహాలలో కవిరాజు రామస్వామి విగ్రహమూ ఉంది. నేటి యువతీ యువ కులు అటు వెళ్లినప్పుడు తప్పకుండా చూడాలి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం త్రిపురనేని రామస్వామి స్మారకార్థం ప్రతి ఏటా ఒక పురస్కారం అందిస్తోంది.
ఒకరుడు ‘వేదమే’ భగవదుక్తమటంచు నుపన్యసించు
నింకొకరుడు ‘బైబిలే’ భగవదుక్తమటంచును వక్కణించు
వేరొకండు మా ‘ఖొరాన్‌’ భగవదుక్తమటంచును వాదులాడు,
నీ తికమకలేల పెట్టెదవు తెల్పగ రాదె నిజంబు నీశ్వరా!
నిజము తెల్పుమని ఇక్కడ ఈశ్వరుణ్ణి కవి అడుగుతు న్నాడంటే – ఆయన ఉనికిని గుర్తిస్తున్నట్టు కాదు. ఇది ఒక వ్యంగ్య వ్యాఖ్య. లేని దేవుణ్ణి జనం మీద రుద్ది ఏ మహిమా లేని పవిత్ర గ్రంథాల ప్రసక్తి తెచ్చి పబ్బం గడుపుకుంటున్న వారిని హేళన చేయడం ఇందులో ఉంది. ఇతర రంగాలలో ప్రముఖులయినా సరే, కొందరు దేవుడి విషయానికి వచ్చే సరికి గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి చర్యకు రామస్వామి స్వస్తి చెప్పారు. ధైర్యంగా తన హేతువాద దృక్పథాన్ని తన జీవితంలో పాటించి చూపారు. అదే తన సాహిత్యంలోనూ నమోదు చేశారు. అందుకే తెలుగు సమాజానికి ఓ సూత పురాణం, ఓ శంభుక వధ, ఓ ఖూనీ, ఓ ధూర్త మానవా శతకం, కొన్ని సూతాశ్రమ గీతాలు. దక్కాయి. ఈ పుస్తకాల్ని నేటి యువతీ యువకులు వెతుక్కుని చదవాలి. వాటి స్ఫూర్తితో సమకాలీన సమాజాన్ని హేతువాత, మానవవాద ఆలోచనా ధోరణిలోకి నడిపించాలి.
త్రిపురనేని రామస్వామి 15 జనవరి 1887న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక సంపన్న రైతు కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు రామమాంబ – చలమయ్య అప్పట్లో బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి 1898లో పున్నమ్మ అనే బాలికతో పెద్దలు వివాహం జరిపించారు. అప్పటికి ఆయన వయసు పదకొండు. 1910లో ఆయనకు 23 యేట కుమారుడు గోపీచంద్‌ పుట్టాడు. మరోవైపు ఆయన మెట్రిక్యులేషన్‌ కూడా పాసయ్యాడు. ఆ రోజుల్లో చదువులు అలా ఆలస్యం గానే జరిగేవి. మెట్రిక్‌ తర్వాత అదే 23వ యేట యవ్వన దశలో ఎన్నో రచనలు సమా జం మీదికి సంధించారు. పల్నాటి యు ద్ధం ఆధారంగా ‘కారెంపూడి కదనం’ రాశారు. మహాభారత యుద్ధం ఆధా రంగా ‘కురుక్షేత్ర సంగ్రామం’ రాశారు. అయితే, చిత్రమేమంటే ఈ రచనలో ఆ యన పాండవులకు రాజ్యాధికారం లేదని నిరూపించి ఒప్పించారు. కారెంపూడి కదనం. కురుక్షేత్ర సంగ్రామం రెండూ నాటికలే –
ఇక కవిరాజు ఇతర రచనలు :
పల్నాటి పౌరుషం, గోపా లరాయ శతకం, కొండవీటి పతనం, రాణా ప్రతాప్‌, భగవ ద్గీత – మొదలైనవి. భగవద్గీత రచన భగవద్గీతను సమర్థిస్తూ రాసింది కాదు. విమర్శిస్తూ వెలువ రించిన ఒక వ్యంగ్యరచన. అలాగే, రాణా ప్రతాన్‌ రచన విషయంలో ఒక విచిత్రం జరిగింది. అది అచ్చులో ఉండ గానే అందులోని విషయం ఎలా బయ టికి చేరిందో, అది నాటి ప్రభుత్వ దృష్టికి ఎలా వెళ్లిందో తెలియదు. కానీ, ఆ రచన అచ్చవుతూ ఉండగా ప్రెస్‌లోనే నాటి బ్రిటీష్‌ ప్రభుత్వ నిషేధానికి గురైంది. 1911లో బందరు నోబెల్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివారు. అప్పుడే చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శిష్యరికం చేసి మొదట అష్టావధానం, తర్వాత శతావధానం చేయగలిగారు. ఆ వయసులో అంతటి ధారణా శక్తిని, సాహిత్యం మీద సాధికారతను సాధించడం మా మూలు విషయం కాదు. అయితే చదువు పూర్తి చేసి ఏదో వృత్తిలో స్థిరపడాల్సి ఉంది గనుక, అవధానాలు మానేసి న్యాయ శాస్త్రం చదవడానికి 1913లో బొంబాయి వెళ్లారు. ఏదో కారణం వల్ల వెంటనే తిరిగొచ్చారు.
1914లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ యూని వర్సిటీకి వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదివారు. దానితో పాటు ఆంగ్ల సాహిత్యాన్నీ చదివారు. అయితే అక్కడ కూడా ఆయన పంచె కట్టుతోనే గడిపేవారు. ‘ఏ దేశంలో ఉంటే ఆ దుస్తులే వేసుకోవాలిగానీ ఇదేమిటని’ – అక్కడ ఒక బ్రిటీష్‌ మహిళ హేళన చేసింది. అయితే ఆయన ఖాతరు చేయలేదు. తన తెలుగుతనాన్ని, పంచెనూ వదలు కోలేదు, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషమేమంటే, ఆయన డబ్లిన్‌లో ఉన్నా – ఆయన మనసు ఇక్కడ తెలుగు నేల మీదే ఉండేది. డబ్లిన్‌ నుంచి ఇక్కడి కృష్ణా పత్రికకు వ్యాసాలు రాసేవాడు. అంతే కాదు ‘శంభుక వధ’ అనే ప్రసిద్ధ రచన ఆయన డబ్లిన్‌లో ఉండగా రాసిందే! అనిబిసెంట్‌ చేస్తున్న హోంరూల్‌ ఉద్యమానికి మద్దతుగా రాశారు. మద్దతివ్వండని ఇక్కడి ప్రజల్ని ప్రోత్సహించారు. అక్కడి నుండే ఎన్నో దేశభక్తి గీతాలు అందించారు. ఆ రకంగా హేతువాదం, మానవవాదం తెలుగు సాహి త్యంలో ప్రవేశపెట్టినవాడిగా కవిరాజు త్రిపుర నేనికి గుర్తింపు వచ్చింది.
డబ్లిన్‌ నుంచి తిరిగి వచ్చి త్రిపురనేని 1917లో తొలుత మచి లీపట్నంలో న్యాయవాదిగా నాలుగైదేళ్లు ప్రాక్టీసు చేశారు. 1922 లో అక్కడి నుండి తెనాలికి మారి, న్యాయవాదిగా అక్కడ స్థిర పడ్డారు. వృత్తితో పాటు, సామాజిక అన్యాయాల్ని, మత అరా చకాల్ని ఎదిరించే తన ప్రవృత్తిని మేల్కొల్పారు. రాజరామ్మోహన్‌ రారు, రానడే కందుకూరి, గురజాడ వంటి వారి ఆదర్శాల్ని ప్రజ ల్లోకి తీసుకెళ్ళేవారు. ఇలాంటి సంఘ సంస్కరణ కార్యక్రమాల వల్ల ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఫలితంగా 1925లో తెనాలి పురపాలక సంఘానికి జస్టిస్‌ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అయితే ఆయన సంస్కరణ వాదం ఆయన పదవికి ముప్పు తెచ్చింది. పురపాలక సంఘ అధ్యక్షునిగా జంతు బలుల్ని నిషేధిస్తే – అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనను పదవి నుండి దింపేశారు. త్రిపురనేని వారు కంగారు పడలేదు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించి పదవి చేజిక్కించుకున్నారు. జంతు బలుల్ని నిషేధించారు. అంతే- ప్రత్యర్థులు దిక్కుతోచక తోక ముడిచారు. ఈసంఘటనతో మనకు నిరీశ్వరవాది, బ్రిటీష్‌ పార్లమెంట్‌ మెంబర్‌ ఛార్లెస్‌ బ్రాడ్లా (1833-1891) విషయం గుర్తుకొస్తుంది. ఆయన దేవుడి మీద ప్రమాణం చేయమని అన్నందుకు, ఆత్మసాక్షిగా మాత్రమే చేస్తానన్నందుకు వేధించి, వేధించి డిస్మిస్‌ చేశారు. ఆయినా ఆయనే మళ్లీఎన్నికై వచ్చారు. చివరకు ఆనాటి బ్రిటీష్‌ పార్లమెంట్‌ వ్యవస్థే దిగొచ్చింది. ఎవరి ఇష్ట ప్రకారం వారు ప్రమాణస్వీకారం చెయ్యొచ్చని 1888లో బిల్లు పాస్‌ చేసుకుంది.
సంఘ సంస్కర్తగా కృషి చెస్తూ వచ్చిన కవిరాజు తను నివాసమున్న ఇంటికి ‘సూత్రాశ్రమం’ – అని పేరు పెట్టుకున్నారు. వేదాలు, పురాణాలు ఎంత నీతి బాహ్యంగా ఉన్నాయో చెప్పడానికి తన ఆత్మీయమిత్రుడు కుప్పుస్వామి పేరుతో ‘కుప్పుస్వామి శతకం’ (1930) రాశారు. ”పరుల నీ ముందు దిట్టెటి వాడు నిన్ను / నొరిని ముందు దిట్టక యుండబోడు / చదువు రవ్వంత వానికి ఒసంగరాదు / ముప్పు ఒచ్చున్‌ దప్పక దాన గుప్పుస్వామి” నీ ముందు వేరేవాళ్ళను తిట్టేవాడు. వేరే వాళ్ళ ముందు నిన్ను తిట్టడని నమ్మకమేమిటీ? అలాంటి వాడికి ఏ మాత్రమూ చనువు ఇవ్వగూడదని హెచ్చరిస్తూ చెప్పిన పద్యం ఇది. మరో వైపు అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ, మంత్రాలు లేని పెళ్లి విధానానికి సరళమైన తెలుగులో ఒప్పందాలు – ప్రమా ణాలతో ఒక పెళ్లి విధానం (వివాహ విధి 1930) రూపొం దించారు. దాని ప్రకారం ఎన్నో కులాంతర వివాహాలు జరిపిం చారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆయన పురపాలక సంఘ అధ్యక్షుడిగా నిరాఘాటంగా 13 ఏళ్లు నిలదొక్కుకున్నారు. ప్రజాభిమానం ఎంతగా పెరిగిపోయిందంటే, 1940లో గుడివాడలో ఆయనతో గజారోహణం చేయించి, ఘనంగా సన్మానించుకున్నారు. ఆ రోజుల్లోనే ఆంధ్రమహాసభ ‘కవిరాజు’ బిరుదునిచ్చి గౌరవించుకుంది. 1941లో ప్రఖ్యాత మానవవాది ఎం.ఎన్‌.రారు తెనాలిలోని వీరి సూతాశ్రమాన్ని సందర్శించారు. కవిరాజు ఖ్యాతి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించిందనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మూడు సార్లు సెనెట్‌ మెంబరయ్యారు.
వీర గంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ
పూసి పోదుము మెడనువైతుము పూలదండలు భక్తితో-
అనే ప్రసిద్ధ గీతం అందరికీ తెలిసిందే. అది కవిరాజు త్రిపురనేని రామస్వామి రచనే. ఒక స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన బ్రిటీష్‌ పాలకులపైకి తన జీవితాంతం అక్షర తూటాలను సంధిస్తూ వచ్చారు. కేవలం 56 ఏళ్లు జీవించిన వీరు, ఎన్ని రంగాలలో ఎంతెంత కృషి చేస్తూ కూడా ఒక హేతువాదిగా, ఒక మానవవాదిగా అజేయంగా నిలబడడం సామాన్యమైన విషయం కాదు. అందువల్ల ఆయన రాసిన ఆ ప్రసిద్ధ గీతంలోని వీరుడెవరో కాదు నిస్సందేహంగా ఆయనే! అందువల్ల కవిరాజా త్రిపురనేని రామస్వామి అందించిన స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ మనం ముందుకు సాగాల్సి ఉంది!


– కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్ర వేత్త
– డాక్టర్‌ దేవరాజు మహారాజు