టీటీడీ ఆస్తుల వేలంలో ట్విస్ట్.. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఆస్తుల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డు తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని స్పష్టం చేశారు. టీటీడీ ఆస్తులపై మరోకసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆస్తుల అమ్మకంపై నిర్ణయం తీసుకోక ముందే రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. తిరుమల వెంకన్నకు రాజకీయాలు ఆపాదించొద్దని హితవుపలికారు.

భక్తులు సమర్పించే ప్రతి పైసాను తాము కాపాడుతున్నామని, పదవిలో ఉన్నా లేకుండా ఈ విషయంలో రాజీపడబోమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్తకాదని చెప్పారు. 1970 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వాలు ఇలానే అమ్మకాలు చేపట్టాయని అన్నారు. టీడీపీ హయాంలో చదలవాడ కృష్ణమూర్తి టీడీపీ చైర్మన్‌ గా ఉన్నప్పుడు.. నిరర్ధక టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్న ఆ సబ్ కమిటీలో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. అయితే, అప్పుడు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కేవలం సమీక్షించామని, ఇంకా అమ్మాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. అమ్మకంపై వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.