బీజేపీ జగన్‌ను స్టాండ్ బైలో ఉంచిందా..?

అధికారంలోకి వచ్చిననాటి నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఒకదాని వెంట మరొక దానిలో పాగా వేస్తూ సగం దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీకి దక్షిణ భారతదేశం కొరకరాని కొయ్యగా తయారైంది. నార్త్‌లో ఉండేవి రెండే పార్టీలు..కానీ సౌత్‌లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ. వాటి సహకారం లేకుండా అధికారంలోకి రావడమన్న మాట కల్ల. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు జాతీయ పార్టీలకు అనుకూలంగా మారుతున్నాయి. జయ మరణం తర్వాత తమిళనాడులో జరిగిన నాటకీయ పరిణామాలు బీజేపీకి కలిసొచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ బలంగా ఉన్నాయి. తెలంగాణతో పోల్చి చూస్తే, ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎలాగైనా బలపడాలనీ చూస్తోంది కమలం. అందుకే గత కొద్ది రోజులుగా ఎత్తుల మీద ఎత్తులు వేస్తోంది. జగన్‌కు ఉన్నట్లుండి మోడీ అపాయింట్‌మెంట్ రావడం, అమిత్ షా పర్యటన ఇవన్నీ బీజేపీ మార్క్ వ్యూహాలుగా చెప్పుకోవాలి.

 

 గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. కేంద్ర., రాష్ట్రాలలో బీజేపీ-టీడీపీ ప్రభుత్వాల సంకీర్ణం కొనసాగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా టీడీపీ-బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. బాబును వదులుకుంటే అసలుకే మోసం వస్తుందని కమలదళానికీ తెలుసు. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని తెలుగుదేశానికి హ్యాండ్ ఇవ్వాలని బీజేపీ అగ్రనేతల ప్లాన్. ఇలాంటి టైంలో బీజేపీకి కలిసివచ్చే అంశం జగన్. ఏపీలో చంద్రబాబుకు, టీడీపీకి సరైన ప్రత్యామ్నాయంగా మారింది వైఎస్సార్‌సీపీ. 2014లో అధికారం చేజారినా 2019లో ఎలాగైనా కొట్టాలనే కసితో జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ఆయన్ను కేసుల భయం వెంటాడుతోంది. కాంగ్రెస్‌తో ఉన్న విభేదాల వల్ల జగన్‌ ఆ పార్టీతో జట్టు కట్టే పరిస్థితులు లేకపోవడంతో వైసీపీని తమ గుప్పెట్లో ఉంచుకోవడమే మేలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

 

జగన్‌ మీద ఉన్న కేసులను సాకుగా చూపి అతనిపై బీజేపీ ఒత్తిడి చేయొచ్చని అంచనా వేస్తున్నారు. జగన్‌ తమ దారికి వచ్చినా రాకపోయినా అతనిని స్టాండ్‌బైలో ఉంచుకోవడం మాత్రం బీజేపీకి అనివార్యంగా కనిపిస్తోంది. 2019 నాటికి దేశవ్యాప్తంగా బీజేపీ బలపడినా., బలహీనపడినా ముందస్తు పరిణామాలకు సిద్ధపడి రాజకీయాలు చేయాలని మోదీ-షా ద్వయం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవసరమైన మెజార్టీ దక్కకపోతే వైసీపీ వంటి పార్టీలను కలుపుకుపోవాలని భావిస్తోంది. ఇక చంద్రబాబు ఎప్పటికీ బీజేపీ గుప్పెట్లోనే ఉండిపోయేలా చక్రబంధం చేసేశారు. 

 

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలపడాలని భావిస్తోన్న బీజేపీ ఏపీలో తమ వాటా పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్యే., ఎంపీ స్థానాలను భారీగా డిమాండ్‌ చేయనుంది. పాత మిత్రుడు చంద్రబాబుతో దోస్తీ చేస్తూనే వైసీపీతో స్నేహగీతం పాడాలనే ద్విముఖ వ్యూహాన్ని మోడీ-షా ద్వయం అమలు చేయనుంది. తద్వారా ఆనాటికి ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటే వారితో అంటకాగడానికి బీజేపీ సిద్దంగా ఉందన్న మాట. మరోవైపు కావూరి సాంబశివరావు., పురంధేశ్వరి., కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్లు ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. వీరంతా గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసి టీడీపీలో చేరలేక బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల నాటికి వారందరికి తగిన రాజకీయ భవిష్యత్తును చూపాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది.