ఆ విషయం తెలిసి కూడా బాబు మోసం చేశారు: జగన్

 

కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాపు రిజర్వేషన్ల అంశం ఇవాళ్టిది కాదని.. గత కొన్నేళ్లుగా ఆ సామాజికవర్గానికి చెందిన వారు పోరాడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని బాబు తెలిపారు. కాపు రిజర్వేషన్లపై మోసం చేశాడని తనను విమర్శించారని, మోసం చేసింది వైఎస్సేనని బాబు విమర్శించారు. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని 2004, 2009లో మేనిఫెస్టోలో పెట్టి వైఎస్‌ ఏం చేశారని ఆయన వైసీపీని ప్రశ్నించారు. పదిశాతం రిజర్వేషన్లు ఓసీలకు ఇస్తే.. అందులో కాపులకు 5 శాతం కేటాయిస్తూ తమ ప్రభుత్వ హయాంలో బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. కాపులకు 5శాతం బిల్లుపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం చేసేందుకే కాపులకు కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. దీనిపై వైకాపా ప్రభుత్వం తమ వైఖరిని సూటిగా తెలియజేయాలని బాబు అన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం జగన్.. బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాలో కనిపించే విలన్‌ క్యారెక్టర్‌, మోసగాడు.. అసెంబ్లీకి వస్తే చంద్రబాబులా ఉంటాడని జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదని.. అదే పద్ధతిలో కాపులను ఆయన మోసం చేశారని జగన్‌ విమర్శించారు. కాపులను మోసం చేశాడు కాబట్టే చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని జగన్‌ చెప్పుకొచ్చారు. జనం ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని జగన్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసమేనని జగన్ దుయ్యబట్టారు. మోసం, అబద్ధాలు చెప్పడం తనకు చేతకాదని జగన్‌ వ్యాఖ్యానించారు.

టీడీపీ హయాంలో కాపులకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని.. కానీ ఖర్చు చేయకుండా వదిలేశారన్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరేంటి అని చంద్రబాబు అడిగారని.. అయితే ఈ ప్రశ్న వేసేముందు కనీసం ఆయన ఆలోచించరా? అని జగన్‌ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని.. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు కాపులను మోసం చేశారన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్నా ఆయన వైఖరి ఇంకా మారలేదని జగన్‌ దుయ్యబట్టారు. ప్రస్తుత బడ్జెట్‌లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించామని జగన్ వివరించారు.

ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్పందించారు. కాపులను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు పాలనలో కాపులకు రూ.2వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. నిర్ణీత వ్యవధిలో కాపు రిజర్వేషన్లు పూర్తి చేస్తామని చెప్పిమోసం చేశారన్నారు. కాపులకు న్యాయం చేయనందుకు ముందుగా క్షమాపణ చెప్పి మాట్లాడాలన్నారు. తాము తొలి ఏడాదిలోపే కాపుల కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని, ఐదేళ్లలో కాపుల అభివృద్ధికి రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్‌ చెప్పలేదన్నారు. తుని రైలు ఘటనలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు.