జగన్ స్థానంలో చంద్రబాబు.. తాజా పరిణామాలతో వ్యూహం మార్చిన ఓవైసీ!

జాతీయ పౌరసత్వ పట్టిక (ఎస్‌పీఆర్) అమలు విషయంలో కేంద్రంతో విభేదిస్తున్న ఎంఐఎం అదినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏపీలోనూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో అడగకుండానే జగన్ కు మద్దతుగా నిలిచిన ఓవైసీ ఇప్పుడు సీఏఏ చట్టానికి మద్దతిచ్చిన జగన్ కు దూరంగా జరుగుతున్నట్లే కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో చేరేందుకు సిద్దమవుతున్న జగన్ కు వ్యతిరేకంగా టీడీపీకి దగ్గరయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్ కు దూరంగా జరిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తనకు పాత మిత్రుడని, జగన్మోహన్ రెడ్డి తనకు ప్రస్తుత మిత్రుడని ( కిరణ్ కుమార్ రెడ్డి వజ్ మై ఫ్రండ్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై ఫ్రండ్) చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతీ సందర్భంలోనూ జగన్ కు అనుకూలంగా ఓవైసీ వ్యవహరించారు. 2014 ఎన్నికల్లోనూ ఏపీలో అధికారం చేపట్టేది వైసీపీయేనని, సీఎం జగనేనని ఆయన అందరికంటే ముందే జోస్యం చెప్పారు. కానీ అప్పట్లో ఆయన అంచనా తప్పింది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు కూడా ఓవైసీ సరిగ్గా ఇదే అంచనా వేశారు. అంతటితో సరిపెట్టకుండా జగన్ కు అనుకూలంగా ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తానంటూ ప్రకటించి సంచలనం రేపారు. చివరికి ఆయన ఏపీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే జగన్ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చేశారు.

సీన్ కట్ చేస్తే గతేడాది పార్లమెంటు ఉభయసభల్లోనూ సీఏఏ చట్టం అమలుకు ఉద్దేశించిన బిల్లుకు వైసీపీ బేషరతుగా మద్దతు పలికింది. అయితే రాష్ట్రంలో ముస్లిం సంఘాలు, నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడితో ఎన్సార్సీని ఏ రూపంలోనూ అంగీకరించబోమని సీఎం జగన్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సహా వైసీపీ నేతలంతా తేల్చిచెప్పారు. అప్పటికే సీఏఏ బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపి వైసీపీ పెద్ద తప్పిదం చేసిందని ఆరోపించిన ఓవైసీ, ఇప్పటికైనా ఎన్సార్సీకి వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంగళవారం విజయవాడలో నిర్వహించిన బహిరంగసభలోనూ ఓవైసీ జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్.పి.ఆర్)కు వ్యతిరేకంగా గళం వినిపించారు. అదే సమయంలో ఎన్.పి.ఆర్ అమలుకు వ్యతిరేకంగా సీఎం జగన్ స్పందించి కోర్టులో  స్టే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. సీఏఏ విషయంలోనూ జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఓవైసీ కోరారు. ఇప్పటికే సీఏఏ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికి ఇరుకునపడ్డ వైసీపీ అధినేత జగన్ కు ఓవైసీ తాజా వ్యాఖ్యలు మరింత ఇబ్బందికరంగా మారాయి.

జగన్ ఎలాగో త్వరలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరిపోతారనే అంచనాకు వచ్చినందునే ఓవైసీ ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని అర్ధమవుతోంది. అయితే జగన్ స్ధానంలో టీడీపీకి మద్దతుగా నిలవాలని ఓవైసీ భావించడం ఇప్పటికిప్పుడు జగన్ కు నష్టం కలిగించకున్నా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు తీసుకురావచ్చు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే సర్కారులో చేరిక కారణంగా తనకు ముందునుంచీ అండగా నిలుస్తున్న ముస్లిం ఓటుబ్యాంకు దూరమయ్యే పరిస్ధితుల్లో ఓవైసీ కూడా టీడీపీకి మద్దతుగా నిలిస్తే ఆ ప్రభావం జగన్ పై తప్పకుండా పడే ప్రమాదం లేకపోలేదు.