టీడీపీ బాటలో వైసీపీ.. అదే తప్పు చేస్తున్న జగన్!!

 

అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల గురించి చర్చించడానికి కాదు.. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి అన్నట్టు తయారవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం, కొత్త ప్రభుత్వం కొలువుతీరాక అప్పటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎంత రచ్చ రచ్చగా జరిగాయో తెలిసిందే. అప్పటి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలు ఒకరిపైఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఎమ్మెల్యే రోజా వంటి వారు సస్పెన్షన్ కి కూడా గురయ్యారు. ముఖ్యంగా టీడీపీ.. వైఎస్ జగన్ ని పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేది.

ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అయితే అసెంబ్లీ సమావేశాల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులే జగన్ సర్కారు కూడా చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీతో పోలిస్తే వైసీపీ.. ప్రతిపక్ష సభ్యులకు బాగానే మాట్లాడే అవకాశం ఇస్తున్నా.. భాష విషయంలో మాత్రం సాక్ష్యాత్తూ సీఎం జగన్ తీరే తీవ్ర విమర్శల పాలవుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఉద్దేశించి నీకు బుద్ధి, జ్ణానం ఉందా? అంటూ జగన్ వ్యాఖ్యానించటం కలకలం రేపుతోంది. అంతే కాదు.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ‘మనిషివి పెరిగావు కానీ.. నీకు బుర్ర పెరగలేదు. నీకు బుర్ర మోకాలిలో కూడా లేదు’ వంటి వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాత్తూ ఓ సీఎం సభలో బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అప్పుడు సభలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులు సభలోనే జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాల్లో శృతి మించి మరీ విమర్శలు చేశారు. వీటిని ప్రజలు ఏ మాత్రం ఆమోదించలేదని ఇటీవల ఎన్నికల ఫలితాలు నిరూపించాయనే చెప్పుకోవాలి. అలాంటిది మంచి సీఎంగా పేరు తెచ్చుకోవాలని, దీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నానని చెబుతున్న జగన్.. గతంలో టీడీపీ చేసినట్లే వ్యక్తిగతంగా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం.. రాబోయే రోజుల్లో ఆయనకే నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.