నా మనసు గాయపడింది... మండలిలో పరిణామాలపై జగన్ ఆవేదన...

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై జగన్ ప్రభుత్వం రగిలిపోతోంది. కౌన్సిల్ ఛైర్మన్ నిర్ణయంపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం... అసలు మండలిని కొనసాగిచాలో వద్దో సోమవారం నిర్ణయం తీసుకుందామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

మండలిలో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్న ముఖ్యమంత్రి జగన్... రాజకీయ అజెండాతో నడుస్తూ... ప్రజలకు మేలుచేసే విధంగాలేని కౌన్సిల్ ను కొనసాగించాలా లేదా అన్న దానిపై సీరియస్ గా ఆలోచన చేయాలన్నారు. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే... మండలిలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాజకీయ అజెండాతో అడ్డుకుంటోందని మండిపడ్డారు. శాసనమండలి కేవలం సలహాలు, సూచనలు ఇవ్వడానికి మాత్రమే ఏర్పడిందన్న జగన్మోహన్ రెడ్డి... చట్టాలు చేయడానికే శాసనసభ ఉందని గుర్తుచేశారు. ప్రజల చేత, ప్రజల వల్లే తమ ప్రభుత్వం ఏర్పడిందని... మొత్తం 175 స్థానాలకు గాను 86శాతం మెజారిటీతో 151 సీట్లను తమకు కట్టబెట్టి శాసనసభకు పంపారని, తాము కూడా ఏడున్నర నెలలుగా ప్రజాసంక్షేమం కోసం సేవ చేస్తూ వస్తున్నామని, అయితే... తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు మండలిని రాజకీయంగా టీడీపీ వాడుకుంటోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

చట్ట సభల్లో భాగమైన మండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని, కానీ కౌన్సిల్ ఛైర్మన్ దానిని వమ్ము చేశారని అన్నారు. నిష్పాక్షికంగా మండలిని నిర్వహించి పరిస్థితి కనిపించలేదన్నారు. గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు... అదీకాకపోతే సవరణలు కోరుతూ తిప్పిపంపవచ్చు. చట్టం కూడా ఇదే చెబుతోంది... కానీ వాటిని లెక్కచేయకుండా విచక్షణ అధికారమంటూ కౌన్సిల్‌ చైర్మన్‌ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ నిర్ణయం తీసుకుని.. ప్రజాస్వామ్యానికి విలువ కూడా లేకుండా చేశారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

మండలిలో ఛైర్మన్ మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించిన సీఎం జగన్... నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపే అధికారం తనకు లేదని చెప్పారని... అలాగే, బిల్లు పెట్టిన 12గంటల్లోపే సవరణలు ఇవ్వాలని, అదేవిధంగా సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే... బిల్లు పెట్టినప్పుడే ప్రతిపాదనలు చేయాలని కూడా ఛైర్మన్‌ చెప్పారని, కానీ... మళ్లీ ఆయనే రూల్స్‌ను అతిక్రమించి బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించారని జగన్ మండిపడ్డారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపకూడదనే మంత్రుల వాదనతో బీజేపీ, పీడీఎఫ్‌, వామపక్ష సభ్యులు ఏకీభవించినా.... సెలెక్ట్‌ కమిటీకి పంపే అధికారం ఛైర్మన్ కు లేకున్నా... తనుకున్న విచక్షణ అధికారంతో నిర్ణయం తీసుకున్నానంటూ ఛైర్మన్‌ చెప్పడం దారుణమన్నారు. చట్టాన్ని ఉల్లఘించేందుకే విచక్షణ అధికారాన్ని వాడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అంటూ ప్రశ్నించారు.

హత్య చేయడం తప్పు... అయినా నేను చేస్తా అన్నట్టుగా మండలి తీరు ఉందని జగన్ అన్నారు. అయితే, ఆ తప్పు చేయకుండా ఆపాలా? వద్దా? అని నేను అడుగుతున్నాంటూ జగన్ ప్రశ్నించారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందన్న జగన్మోహన్ రెడ్డి.... మండలి ప్రజల కోసం నడుస్తోందా... రాజకీయ నిరుద్యోగల కోసం నడుస్తోందా అన్నది ఆలోచన చేయాలన్నారు. మండలి కోసం ఏటా 60కోట్లు ఖర్చు పెడుతున్నాము... అయితే, ఆర్ధిక లోటుతో నడుస్తున్న రాష్ట్రంలో శాసనమండలి అవసరమా? అనేది కూడా ఆలోచన చేయాలన్నారు. 

మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. కానీ అక్కడ సలహాలు, సూచనలు పక్కనబెట్టి ప్రజలకు మేలు జరిగే బిల్లులను ఎలా ఆలస్యం చేయాలో ఆలోచిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని అనుకున్నానని... కానీ, తన నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని వ్యాఖ్యానించారు. మరి, ఇలాంటి మండలిని కొనసాంగించాలా? వద్దా? అనేదానిపై సీరియస్‌గా చర్చ జరగాలన్నారు జగన్. 

మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారన్న జగన్మోహన్ రెడ్డి... డాక్టర్లు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు, సివిల్‌ సర్వెంట్లు అసెంబ్లీలో ఉన్నారని, ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారన్నారని అన్నారు. ఇంత మంది విజ్ఞులు అసెంబ్లీలోనే ఉంటే, మండలి అవసరమేముందని జగన్ ప్రశ్నించారు. మండలిలో పరిణామాలు తన మనసును గాయపరిచాయన్న జగన్మోహన్ రెడ్డి... బిల్లులు చట్టం కాకుండా అడ్డుకుంటున్న కౌన్సిల్ ను కొనసాగించాలో వద్దో సోమవారం శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదం లేదని... రాష్ట్రంలో ఎక్కడ్నుంచైనా పాలన సాగించవచ్చన్నారు జగన్. అలాగే, ఆర్టికల్‌ 174 ప్రకారం ఎక్కడి నుంచి అయినా చట్టాలు చేయొచ్చన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ్నుంచే ప్రభుత్వం నడుస్తుందన్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని పెట్టొచ్చని, ఆ అధికారాన్ని ప్రజలే ప్రభుత్వానికి ఇచ్చారని జగన్ వ్యాఖ్యానించారు.