మండలిని రద్దుచేస్తే తొందరపాటు చర్యే... చీమలు పట్టాయని మొత్తం బెల్లాన్నే పడేస్తారా? 

మూడు రాజధానుల బిల్లు, అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ కౌన్సిల్ ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంతో ఏకంగా మండలి రద్దు దిశగా జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కౌన్సిల్ ఛైర్మన్ నిర్ణయంపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం... అసలు మండలిని కొనసాగిచాలో వద్దో సోమవారం నిర్ణయం తీసుకుందామంటూ సీఎం జగన్ ప్రకటించారు. మండలిలో పరిణామాలు తన మనసును తీవ్రంగా గాయపరిచాయన్న జగన్మోహన్ రెడ్డి... బిల్లులు చట్టం కాకుండా అడ్డుకుంటున్న కౌన్సిల్ ను కొనసాగించాలో వద్దో శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారని, కానీ డాక్టర్లు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు, సివిల్‌ సర్వెంట్లు శాసనసభలో ఉండగా, ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారన్నారని అన్నారు. ఇంతమంది విజ్ఞులు శాసనసభలోనే ఉండగా, ఇక మండలి అవసరమేముందని జగన్ ప్రశ్నించారు. మండలి కోసం ఏటా 60కోట్లు ఖర్చు పెడుతున్నామని.... అయితే, ఆర్ధిక లోటుతో నడుస్తున్న రాష్ట్రంలో కౌన్సిల్ అవసరమా? అనేది సీరియస్ గా ఆలోచన చేయాలన్నారు. హత్య చేయడం తప్పు... అయినా చేస్తామన్నట్టుగా మండలి తీరు ఉందన్న జగన్... అయితే, ఆ తప్పు చేయకుండా ఆపాలా? వద్దా? అని నేను అడుగుతున్నాంటూ జగన్ ప్రశ్నించారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందన్న జగన్మోహన్ రెడ్డి.... మండలి ప్రజల కోసం నడుస్తోందా... రాజకీయ నిరుద్యోగుల కోసం నడుస్తోందా అన్నది ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన తర్వాత నిజంగానే మండలిని రద్దు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తే లాభనష్టాలేంటి? ఎవరికి ఎక్కువ నష్టం? రద్దుకు ఎంత టైమ్ పడుతుంది? ప్రక్రియ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఇంట్లో ఏదైనా పాడైతే... బాగు చేసుకోవాలే తప్ప... మొత్తం ఇల్లే తగలబెట్టుకుంటారా? అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. చీమలు పడితే... చీమలను తీసేయాలి కానీ... మొత్తం బెల్లాన్నే పడేస్తామంటే ఎలా అంటున్నారు. మూడు నాలుగు నెలలు ఓపిక పడితే ముగిసేపోయే సమస్యకు అంత పెద్ద నిర్ణయం ఎందుకంటున్నారు. మండలిలో విపక్షానికి బలముంటే... కేవలం మూడు నెలలు మాత్రమే ఆపగలరని, దాంతో కొంచెం ఆలస్యం అవుతుందే కానీ, పూర్తి ఆపలేరని, ఇంత దానికి, మండలిని రద్దు చేయాలన్న ఆలోచన చేయడం సరికాదని చెబుతున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం కచ్చితంగా తొందరపాటు చర్యే అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.