వైసీపీ సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ కు స్మగ్లర్లతో సంబంధాలు...హవ్వా 

స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త మరువకముందే తాజాగా వైసీపీ ఎంపీ ఒకరు స్మగ్లర్లతో సంబంధాలు అనే వార్త ఎపి ప్రజలను కలవరపెడుతోంది .వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్గాని భరత్ కు స్మగ్లింగ్ బ్యాచ్ లతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు రూ. 2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడ్డ నరేశ్ కుమార్ జైన్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నరేశ్ జైన్ తో మార్గాని భరత్ కలిసి ఉన్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. మార్వాడీలను, ఒడిశా బ్రాహ్మణులను గుద్ది చంపుతానని వైసీపీ నేత ఒకరు ఫోన్ లో బెదిరించారని.. దీనిపై జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.  
ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. భరత్ తో వాసు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ గెలుపొందారు. ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు బరిలోకి దిగారు.
 గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ స్మారక స్థూపాన్ని  వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌  ఆవిష్కరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ హల్‌చల్‌ చేస్తున్నాయి. 
గత నెల చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కాకర్లవంకలో వీరప్పన్ స్మారక స్థూపాన్ని స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాకర్లవంకలో పర్యటించిన ఎమ్మెల్సీ భరత్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి స్థానికులు ఏర్పాటు చేసుకున్న వీరప్పన్‌ స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో  ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. స్మగ్లర్లతో వైసీపీ నేత మార్గాని భరత్ కు సంబంధాలు ఉండటం ఎన్నికల ముంగిట్లో ఉన్న ఎపి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.