తన మాట వినకపోతే చీరేస్తా..వైసీపీ నేత వార్నింగ్ తో ఎంపీడీవో కన్నీళ్లు...

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఫిర్యాదులు వస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు వైసీపీ నేతలు. అధికారులపై దౌర్జాన్యాలకు దిగుతున్నారు. తమ మాట వినడం లేదని, తాము చెప్పినట్లు చేయడం లేదంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. ఏకంగా ఎంపీడీవో కార్యాలయంలోనే వీరంగం వేశాడు. ఎంపీడీవో చాంభర్ లోనే ఎంపీడీవోనూ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశాడు.

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో తన మాట వినకుంటే చీరేస్తానంటూ ఎంపీడీవోను హెచ్చరించాడు మాజీ సర్పంచ్. నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో తమ వర్గానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన నల్లల చెరువు మాజీ సర్పంచ్ వాసంశెట్టి తాతాజీ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. వెళ్తూవెళ్తూనే అక్కడున్న ఎంపీడీవో కేఆర్ విజయపై విరుచుకుపడ్డారు. మహిళా అని కూడా చూడకుండా దౌర్జన్యంగా  వ్యవహరించాడు. తమ మాట వినడం లేదని, మాట వినకుంటే చీరేస్తామని హెచ్చరించాడు.

 ఆ సమయంలో అక్కడే ఉన్న కార్యాలయ సూపరింటెండెంట్ దీక్షితులు చెబుతున్నా వెనక్కి తగ్గలేదు సరికదా, అసభ్య పదజాలంతో దూషించారు. తాను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకుంటే ఎక్కడికైనా పంపించి వేయాలని ఎంపీడీవో చెబుతున్నా తాతాజీ వినిపించుకోలేదు. వైసీపీ నేత దుర్బషలాడంతో ఎంపీడీవో కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో తాము పని చేసుకోలేకపోతున్నామని, నేతల మధ్య నలిగిపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అమలాపురం ఆర్డీవో వసంతరాయుడికి ఫిర్యాదు చేసిన విజయ తనకు రక్షణ కల్పించాలని కోరారు.