రీపోలింగ్ ను బహిష్కరించిన వైసీపీ
posted on Aug 13, 2025 9:48AM

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ లో అవకతవకలు జరిగాయంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గగ్గొలు పెట్టారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం ఆయన ఆరోపించిన రెండు పోలింగ్ కేంద్రాలలోనూ ఈ బుధవారం ( ఆగస్టు 13) రీపోలింగ్ కు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు రీపోలింగ్ ప్రారంభమైంది. అయితే వైసీపీ మాత్రం ఈ రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి మూడు దశాబ్దాలపై పైగా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగిన చరిత్రలేదు. ఎప్పుడూ ఇక్కడ ఏకగ్రీవమే. తొలి సారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతోంది. బరిలో 11 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు.
అయితే వైసీపీ మాత్రం పోలింగ్ ప్రారంభానికి ముందే చేతులెత్తేసి నియోజకవర్గంలో గలాభా సృష్టించి, పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించింది. అయితే పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో వైసీపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరే అదలా ఉంచితే.. వైసీపీ ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు రెండు కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతుంటే.. ఆ రీపోలింగ్ ను కూడా బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుని ఓటమిని ముందే అంగీకరించేసింది. ఇలా ఉండగా రీపోలింగ్ జరుగుతున్న కేంద్రాలలో భారీ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాది.