రెజ్లర్ యోగేశ్వర్‌కు ఒలింపిక్స్‌ రజత పతకం..

అదేంటి జోక్  చేయకండి..యోగేశ్వర్‌‌కేంటి రజత పతకం ఏంటి..? అసలు రియోలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిబాట పట్టిన వ్యక్తికి రజతం ఎక్కడి నుంచి వచ్చింది. మీ డౌట్ మేం క్లారిఫై చేస్తాం.. ఈ రజతం రియోలో వచ్చింది కాదు. లండన్‌ ఒలింపిక్స్‌ నాటిది. నాటి ఒలింపిక్స్‌లో 60 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగిన యోగేశ్వర్ కాంస్య పతకాన్ని సాధించాడు. అయితే ఆ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ శాంపిల్స్‌పై జరిపిన డోప్ టెస్లుల్లో అతడు పాజిటీవ్ అని తేలింది. 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుదుస్కోవ్ మరణించాడు. నాడు ఒలింపిక్స్‌లో టెక్నాలజీ వినియోగం అంతంత మాత్రమే..అందుకే అన్ని దేశాల క్రీడాకారుల శాంపిల్స్‌పై ఇప్పుడు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కుదుఖోవ్‌ డోపింగ్ టెస్టుల్లో విఫలమయ్యాడు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ఫలితాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం వెల్లడిస్తే వారి పతకాలు వెనక్కి తీసుకుంటారు. దీంతో లండన్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్‌ రజత పతక విజేతగా మారినట్లవుతుంది.