విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తాం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్

తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశమే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.  ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం (జూన్ 27) మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోందన్నారు.

 విద్యుత్ ఉద్యోగుల శిక్ష‌ణ కోసం ప్ర‌త్యేకంగా నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నం దేశంలోనే అత్యుత్త‌మ శిక్ష‌ణ కేంద్రంగా నిలుస్తుంద‌ని, నిలవాలనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఈ భ‌వ‌నం ద్వారా సుమారు 40 శాతంపైగా విద్యుత్ ఆదా అవుతుండ‌టం ఆద‌ర్శ‌ప్రాయమ‌న్నారు. విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాలతో విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈపీడీసీఎల్ పరిధిలోని సుమారు 20 మందికి సంస్థలో ఉద్యోగం కల్పిస్తు ఉత్తర్వులు అందజేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబాలు ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా వీలైనంత తక్కువ రోజుల్లోనే కారుణ్య నియామక పత్రాలు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 నెలల్లో సుమారు 180 మందికి ఇలా నియామక పత్రాలు అందజేసినట్లు మంత్రి చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధికి ఇదొక ఉదాహ‌ర‌ణ అని మంత్రి గొట్టిపాటి చెప్పారు.

విద్యుత్ శాఖ‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా  చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌నీ,  24 గంట‌లూ నాణ్య‌మైన గ్రీన్ ఎన‌ర్జీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అందించే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నామనీ చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో 20 ల‌క్ష‌ల సోలార్ విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నీసం 10 వేల సోలార్ విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీఎస్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu