TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బాబు భేష్: అమరావతి నిర్మాణ వేగం శభాష్: ఏపీ సీఎంపై వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు.!

Published on: Thu Nov 26, 2026 11:43AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణg, అభివృద్ధి పనుల వేగంపై ప్రపంచ బ్యాంకు  ప్రశంసలు  గుప్పించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం విషయంలో చూపుతున్న చొరవ అనితర సాధ్యమని ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు కొనియాడారు. అమరావతి పనులలో ఇదే వేగం కొనసాగితే..  నిర్దేశించుకున్న గడువు కంటే ముందే రాష్ట్ర రాజధాని ప్రాజెక్టు పూర్తవుతుందని అభిప్రాయపడ్డారు.   ప్రపంచ బ్యాంకు,  ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధుల బృందం అమరావతి ప్రాంతంలో బుధవారం (నవంబర్ 25) పర్యటించి  నిర్మాణ పనులను   పరిశీలించింది.
 సీఆర్డీఏ  అధికారులతో కలిసి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి  బ్యాంకుల ప్రతినిధుల బృందం  పర్యటించింది. అలాగే.. అమరావతిలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులతో  చర్చించింది. మారుతున్న ప్రణాళికలకు అనుగుణంగా చేపడుతున్న నిర్మాణ పనుల స్థితిగతులను ప్రతినిధి బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల అమలులో భాగంగా పాటిస్తున్న సామాజిక భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు,   లేబర్ క్యాంపులలో కార్మికులకు కల్పిస్తున్న భద్రత, వసతులపై ప్రతినిధులు వివరాలు ఆరా తీశారు.

అంతేకాకుండా కమ్యూనికేషన్ ప్రణాళిక, సమస్యల పరిష్కార వేదిక పనితీరు, రాజధాని రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను బ్యాంకు బృందం సమీక్షించింది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన వివిధ పథకాల అమలు తీరును పరిశీలించి అధికారులకు  అవసరమైన  సూచనలు చేసింది. అలాగే..  వైకుంఠపురం పంపింగ్ స్టేషన్, రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలు, కృష్ణా కరకట్ట రహదారి, మందడం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది.

అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు  ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సంగతి విదితమే. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ రెండు బ్యాంకల ప్రతినిధులు అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, నిధుల వినియోగం, పనుల నాణ్యత, ప్రగతిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా పర్యటన జరిగింది.

ఆర్థిక సహాయ వివరాలను పరిశీలిస్తే, అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు,  ఆసియా అభివృద్ధి బ్యాంకు చెరో   15 వేల కోట్లు చొప్పున మొత్తం  30 వేల కోట్ల  రూపాయల రుణాన్ని మంజూరు చేశాయి.  ఈ   రుణంలో ఇప్పటికే దాదాపు 22 వేల కోట్ల రూపాయల  నిధులు రాష్ట్రానికి అందాయి. పనుల వేగం పెరిగిన నేపథ్యంలో అదనంగా మరో రూ. 15 వేల కోట్ల రుణం సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా, ప్రస్తుతం ఆ ప్రతిపాదనపై బ్యాంకుల స్థాయిలో పరిశీలన కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి:  అమరావతికి చట్టబద్ధతపై గెజిట్.. చంద్రబాబు హర్షం​

ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో పనులను పర్యవేక్షిస్తుండటం వల్ల ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంసలు గుప్పించారు. బ్యాంకుల బృందం ఇచ్చిన సూచనలను అమలు చేస్తూ, పర్యావరణ,  సామాజిక నిబంధనలను పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు  సీఆర్డీఏ అధికారులు ఈ సందర్భంగా చెప్పారు.

ఇక అదనంగా రాష్ట్రం కోరిన 15 వేల కోట్ల రూపాయల రుణంపై   ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి సానుకూల నిర్ణయం వెలువడితే అమరావతిలో మౌలిక సదుపాయాలు, రహదారులు, రివర్ ఫ్రంట్ వంటి కీలక ప్రాజెక్టులు మరింత వేగవంతం అవుతాయనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ బ్యాంకుల ప్రశంసల నేపథ్యంలో రాజధాని నిర్మాణ పనులు నిర్ణీత సమయానికంటే ముందే ఒక రూపానికి వస్తాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమౌతోంది.

మీకు నచ్చవచ్చు: అమరావతి పనులు భేష్: పారదర్శకత శభాష్.. అదనపు ఆర్థిక సాయానికి అంతర్జాతీయ బ్యాంకులు సై.!​

హైదరాబాద్ గతం.. అమరావతి భవిష్యత్.. చంద్రబాబునాయుడు​


[World Bank, ADB, Praises, AP CM Chandrababu, initiatives, Speed,   Amaravati, Development projects,TeluguOne]