అమరావతి పనులు భేష్: పారదర్శకత శభాష్.. అదనపు ఆర్థిక సాయానికి అంతర్జాతీయ బ్యాంకులు సై.!
Published on: Sat Oct 17, 2026 5:56PM

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మణానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అనూహ్య స్థాయిలో అదనపు సహాయం లభిస్తున్నది. రాజధాని అమరావతిలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన, శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధి బృందాలు.. మరో 15 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి.
రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఈ ప్రాజెక్టుకు నిధులు అందిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ఒప్పందాలు కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రెండు బ్యాంకుల ఉన్నత స్థాయి ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పర్యటించి, క్షేత్రస్థాయిలో సాగుతున్న రోడ్లు, డ్రైనేజీ, అడ్మినిస్ట్రేటివ్ సిటీ నిర్మాణాలు, కార్మికుల సంక్షేమ చర్యలను పరిశీలించాయి.
.webp)
ఈ సందర్శన ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీయే అధికారులతో అంతర్జాతీయ బ్యాంకుల బృందం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో రాజధాని తదుపరి దశల నిర్మాణాలకు అవసరమైన నిధుల అవసరాలను సీఆర్డీఏ అధికారులను ఈ బృందం అడిగి తెలుసుకుంది.
సీఆర్డీయే అధికారుల అదనపు ప్రతిపాదనలను తెలియజేయగా, సీఆర్డీఏ ప్రణాళికలు, పనులలో కనబరుస్తున్న పారదర్శకత పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ బ్యాంకుల ప్రతినిథుల బృందం మరో 15 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఈ అదనపు ఆర్థిక సయానికి సంబంధించి ప్రాజెక్ట్ ప్రాసెస్, పనుల నాణ్యత, నిర్వహణ పర్యవేక్షణ కొరకు ప్రత్యేకంగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ను నియమించాలని బ్యాంకుల ప్రతినిధులు సూచించారు. వారి సూచనకు అనుగుణంగా త్వరితగతిన కన్సల్టెంట్ను నియమించేందుకు సీఆర్డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ అదనపు ఆర్థిక సహకారం అందితే.. ప్రాజెక్టు మొదటి దశ పనులను నిర్దేశించుకున్న 2029 కాలపరిమితి నాటికి అత్యంత నాణ్యతతో పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుంది.

ప్రస్తుతం అమరావతి రాజధాని పరిధిలో 52 వేల కోట్ల రూపాయల విలువైన 102 మౌలిక వసతుల కల్పన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఐకానిక్ వంతెనలు, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, ప్రభుత్వ భవనాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి లభిస్తున్నఅదనపు నిధులు నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోవడానికి దోహదం చేస్తాయి. అంతర్జాతీయ బ్యాంకులు అదనపు సాయానికి ముందుకు రావడం ప్రాజెక్ట్ విశ్వసనీయతను మరింత పెంచుతుందని, దీనివల్ల అమరావతికి ప్రైవేటు పెట్టుబడులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Amaravati Works progress Good, World Bank And ADB Accepts Additional Loan, 15000 Crore, Amaravati Capital Development, Telugu One]


