డేటింగ్ యాప్ తో ఎర..! పరువు, ఉద్యోగం హరోంహర!!

టెక్నాలజీ మానవాళికి ఎంతో మేలు చేస్తున్నది. అదే సమయంలో వ్యక్తుల దౌర్బల్యాలను ఆసరాగా తీసుకుని మోసాలు చేసే వారి సంఖ్యా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది.  అంతర్జాలంలో డేటింగ్ యాప్ ల పేరుతో తమ ఎరలో పడిన వారిని దోచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ యాప్ ల వలలో పడి సర్వం కోల్పోతున్నవారు కొందరైతే.. తామ పని చేస్తున్న సంస్థకే టోపీ వేసి మరీ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఉద్యోగాలకూ ఎసరు తెచ్చుకుంటున్నవారు మరి కొందరు.

ఇదిగో సరిగ్గా అలాంటి రెండో కోవకే చెందుతాడీ బ్యాంకు మేనేజర్. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతి వేసిన ఎరకు చిక్కుకుని డబ్బు, పరువు, ఉద్యోగం అన్నీ పోగొట్టుకుని గోడుగోడున విలపిస్తున్నాడు. వివరాలలోకి వెళితే... బెంగళూరుకు చెందిన ఒక బ్యాంకు మేనేజర్ హరిశంకర్ కొద్ది కాలం కిందట తన ఫోన్ లో ఓ డేటింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. కొన్ని రోజులకు ఆ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. స్వీట్ నథింగ్స్ అంటూ పలు ప్రేమ సందేశాలను ఆ యాప్ ద్వారా పంచుకున్నారు.

వీడియో కాల్స్, మెస్సేజెస్ ద్వారా వారి ప్రేమ గోల కొంత కాలం సందడిగా సాగింది. ఆ తరువాత వ్యాపారం ప్రారంభించాలంటూ ఆ యువతి హరిశంకర్ ను కొంత సొమ్ము ఇవ్వాల్సిందిగా కోరింది. పాపం అతగాడు కరిగిపోయి ఆమె ఖాతాకు 12లక్షల రూపాయలు బదలీ చేశాడు. అది చాలదు మరింత కావాలని కోరడంతో ఏం చేయాలో తోచని హరిశంకర్ తాను పని చేసే బ్యాంకులోని ఒక సీనియర్ సిటిజన్ ఖాతా నుంచి రూ.6 కోట్ల రూపాయలు రుణాన్ని ఆమె పేరిట తీసుకుని తన ఖాతాకు బదలీ చేసుకున్నాడు. ఆ తరువాత అందులో నుంచి 5.69 కోట్ల రూపాయల మొత్తాన్ని తన డేటింగ్ యాప్ ప్రేయసికి బదలీ చేశాడు. 

 అయితే రుణానికి సంబంధించిన సందేశాలు సీనియర్ సిటిజన్ ఫోన్ కు రావడంతో అనుమానం వచ్చిన ఆమె బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో హరిశంకర్ బండారం బయటపడింది. బ్యాంకు సొమ్ము కాజేశాడంటూ హరిశంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులు సస్పెండ్ చేశారు. విచారణలో హరిశంకర్ తనను మోసం చేసి ఓ యువతి డబ్బులు తీసుకుని ఇప్పుడు  ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని వెల్లడించారు.