మోడీ.. జగన్ నూ టార్గెట్ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఏపీ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ రెడ్డి అరాచకాలకు, అడ్డగోలు అప్పులకు కేంద్రం పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారన్న భావన ఏపీలో గట్టిగా వ్యక్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో జగన్ సర్కార్ విషయంలో ఒకలా, తెలంగాణ సర్కార్ విషయంలో ఒకలా కేంద్రం వ్యవహరిస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, పరిమితిని మించి ఏపీకి అప్పులు మంజూరు అవుతుండగా, అవే నిబంధనల సాకుతో  తెలంగాణకు మాత్రం అప్పులు దక్కకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ అడుగడుగునా అడ్డుపడుతున్నది. 

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండూ కూడా మోడీ అడుగులకు మడుగులొత్తుతూనే మనుగడ సాగించాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందో  అప్పటి నుంచీ కేంద్రంతో బీఆర్ఎస్ బంధం ఉప్పూ నిప్పులా మారింది.
అలా మారడానికి కారణమేమిటో ప్రధాని మోడీ నిజామాబాద్ బహిరంగ సభ సాక్షిగా మంగళవారం ( సెప్టెంబర్ 3) వెల్లడించారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ప్రధాని మోడీ కేసీఆర్ హస్తినలో తనతో భేటీ అయిన సందర్భంగా ఏం మాట్లాడారు, ఏం కోరారు అన్నది బయటపెట్టి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కాళ్ల కింద నేల భూకంపం వచ్చినట్లుగా కదిలిపోయేలా చేశారు. ఇంతకీ మోడీ ఏం చెప్పారంటే నాలుగేళ్ల కిందట.. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు బీజేపీ చేతిలో చావుతప్పి కన్ను లొట్టపోయినంత పనైంతరువాత కేసీఆర్ హస్తిన వెళ్లి మోడీతో భేటీ అయ్యారు. ఆ భేటీలో బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్)  ను ఎన్డీయేలో చేర్చాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్ కు పట్టం కట్టాలని భావిస్తున్నాననీ, అందుకు ఆశీర్వాదం కావాలని మోడీని అడిగారు. అలా అని మోడీ నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పారు. అంతే కాదు.. తాను ఎన్డీయేలో బీఆర్ఎస్ ను చేర్చుకోవడానికి నిరాకరించాననీ వెళ్లడించారు. అంతే కాదు.. ఇదేమీ రాజరికం కాదనీ, ప్రజల ఆశీస్సులుంటేనే పదవులు దక్కుతాయనీ, కేటీఆర్ ప్రజామద్దతుతో ముఖ్యమంత్రి అయితే ఆశీర్వదిస్తాననీ అన్నానని కూడా సెలవిచ్చారు. ఆ తరువాత నుంచే కేసీఆర్ కేంద్రం, మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం ప్రారంభించారనీ, నాలుగో ఫ్రంట్, మూడో ప్రత్యామ్నాయం అంటూ.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ బయలు దేరారని మోడీ మాటలతో తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలు అంటూ విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఆ తరువాత తన కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొనడంతో సైలంటయ్యారనీ, తన కుమార్తెను మద్యం కుంభకోణం నుంచి బయటపడేయమంటూ అమిత్ షా వద్దకు తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పని చేసిన నరసింహన్ ను రాయబారం పంపారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో కీలెరిగి వాతపెట్టిన చందంగా కేసీఆర్ రాజకీయాలన్నీ స్వార్ధం కోసమేనని మోదీ కుండబద్దలు కొట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మోడీ కూడా ఎన్నికల సమయంలోనే ఆరోపణలు చేస్తారనీ, లేకుంటే నాలుగేళ్లుగా గోప్యంగా ఉంచిన విషయాన్ని ఎన్నికల సమయంలోనే ఎందుకు వెల్లడించారనీ ప్రశ్నిస్తున్నారు.  ఇదే విధంగా  ఎన్నికల ముంగిట ఏపీలో జగన్ సర్కార్ బండారాన్ని కూడా మోడీ బయటపెట్టగలరా అని ప్రశ్నిస్తున్నారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లభించని విధంగా కోరినప్పుడల్లా ప్రధాని అప్పాయింట్ మెంట్ లభిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే.. సిఎం జగన్ సగటున నెలకొకసారి అయినా మోడీ, షాలతో హస్తినలో భేటీ అవుతుంటారు. ఆ భేటీలలో చర్చకు వచ్చే  అంశాలేమిటన్నది బ్రహ్మ రహస్యం అన్నట్లుగా ఉంటుంది. అధికారిక పర్యటనపై హస్తిన వెళ్లిన సీఎం మొక్కుబడి ప్రెస్ నోట్ విడుదల చేయడం తప్ప.. హస్తినలో కానీ, ఏపీలో కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన దాఖలాలు లేవు.  పైగా కేంద్రం పెద్దలతో జగన్  భేటీలన్నీ ఆయనపై అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చినప్పుడు,  సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచినప్పుడు ఉంటాయి. జగన్ హస్తిన వెళ్లి వచ్చిన తరువాత  సీబీఐ దూకుడు ఉండదు, అక్రమాస్తుల కేసుల విచారణ మందగిస్తుంది.   ఇప్పుడు పరిశీలకులు ఆ విషయాలనే సోదహరణగా ప్రస్తావిస్తూ.. జగన్ కు ఈ స్థాయిలో ప్రయోజనం కలిగిస్తున్న మోడీ తనతో భేటీ సందర్భంగా జగన్  ఏం మాట్లాడారు, ఏం కోరారు అన్నది వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

 ఇప్పుడు స్కిల్  కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ తన ప్రతిష్టనే కాకుండా తనకు అండదండగా ఉంటూ వస్తున్న మోడీ ప్రతిష్టను కూడా మంటగలిపేశారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికీ ఏపీలో నడుస్తున్న స్కిల్ సెంటర్ల పేరును మార్చేసి అవి కేంద్రం స్పాన్సర్ షిప్ తో నడుస్తున్న కేంద్రాలుగా చూపే ప్రయత్నం చేసి మోడీని కూడా ఇరికించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ తనపై నింద పడకుండా ఉండేదుకైనా సరే జగన్ బండారాన్ని బయటపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే జగన్ ది కక్ష సాధింపు రాజకీయం అయితే మోడీది ఎన్నికల రాజకీయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టడానికి గల కారణాన్ని ఎలాగైతే ఎన్నికల వేళ వెల్లడించారో.. అలాగే జగన్ బండారాన్ని కూడా ఏపీలో ఎన్నికల సమయం మరింత దగ్గరపడిన సమయంలో మోదీ బట్టబయలు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.