కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి కారణాలివే!

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో వున్న కొండేటి శ్రీధర్ మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. తన నియోజకవర్గం పరిధిలోని పెద్ద పెండ్యాల్ గ్రామంలో వున్న మామిడి తోటలో శ్రీధర్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో వున్న శ్రీధర్ని ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే వున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్ల ముందు రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేయడం మీద పోలీసులు, రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్రీధర్ ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. వర్ధన్నపేటలో రాజకీయంగా హోరాహోరీ పోరు జరుగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ డబ్బు కుమ్మరిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీధర్ తన శక్తికి మించి ఇప్పటికే ఖర్చు పెట్టేశాడు. పార్టీ నుంచి ఫండ్ వస్తుందని అనుకుంటే అక్కడి నుంచి పైసా కూడా రాలలేదు. మరోవైపు ఆర్థికంగా బలంగా వున్న తన ప్రత్యర్థులు డబ్బులు వెదజల్లుతూ వుండటంతో ఈ ఎన్నికలలో తాను ఓడిపోవడం ఖాయమన్న అభిప్రాయానికి శ్రీధర్ వచ్చాడు. దాంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్‌ను టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.