ఫోన్ ట్యాపింగ్ పై కోర్టులో వాదనలు

 

ఓటుకు నోటు కేసులో ఎన్నో ఊహించని పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. అసలు ఈ కేసులోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతగా వెలుగుచూసింది. మా ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఒక రాష్ట్రం అంటే.. చేయలేదని ఇంకో రాష్ట్ర అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ పై రెండు రాష్ట్రాలు చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసుకున్నాయి. అప్పట్లో ఏపీ పోలీసులు సర్వీసు ప్రొవైడర్లను ప్రశ్నించగా తమ అధికారుల ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంపై కోర్టులో వాదనలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కాల్‌డేటా ఇవ్వవద్దని మెమో ఫైల్‌ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించిందని, అందుకే కాల్‌డేటా ఇవ్వలేమని సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు చెప్పారు. కేంద్రం కూడా సమాచారం ఇవ్వవద్దని ఆదేశించిందని లాయర్లు కోర్టుకు తెలిపారు. కేంద్రం ఉత్తర్వులు కోర్టును నిర్దేశించలేవని ప్రాసిక్యూషన్‌ వాదించింది. దీనిపై తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.