విజయనగరం జనానికి జగన్ ఫోటో తప్ప ఎమ్మెల్యేలు కనిపించట్లేదు!!

 

విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేల జాడ అంతగా కనిపించడం లేదు. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు బయటకు వచ్చేందుకు కూడా మొహమాటపడుతున్నారు. వారికి జనాలు అవసరం లేదా లేక జనాలకి వారి అవసరం లేదో తెలియటం లేదు. 2019 ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్ పార్టీ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గెలిచిన వారిలో బొత్స, రాజన్నదొర వంటి సీనియర్లు కొందరైతే అలజంగి జోగారావు , శ్రీనివాసరావుల వంటి జూనియర్లు ఉన్నారు. జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికైన నేతలు విజయోత్సాహంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక నియోజికవర్గాలకు తామే రారాజులమంటూ లోలోపలే పొంగిపోయారు. తమ మాటే శాసనం తమ బాటే రహదారి అనుకుంటూ మురిసిపోయారు. కొన్నాళ్ళపాటు విజయోత్సాహంతో నియోజకవర్గాల్లో బాగానే తిరిగారు. తమ వద్దకు వచ్చి పోయె అనుచరులు, అభిమానుల సందడి తో వారి ఇల్లు కళకళలాడుతుండేవి. నెలలు గడుస్తున్న క్రమంగా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద సందడి తగ్గింది అనుచరుల తాకిడి కూడా చల్లబడింది. వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా పడిపోతూ వచ్చింది. 

ప్రస్తుతం ఎమ్మెల్యేలను పట్టించుకునే వారు కరువయ్యారు.ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ముసుగేసుకుని కూర్చున్నారంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదంటూ చర్చించుకుంటున్నారు. తాము ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఎదురుగా కనిపించిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ నేరుగా తమ అకౌంట్లలోకే చేరిపోతుంటే ఇక ఎమ్మెల్యేలతో పనేంటని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు.. అభిమానులది అదే బాటగా మారింది. నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. ఇక జాబులు పోస్టింగులు అన్ని అధికారుల కనుసన్నల్లోనే జరుగుతాయి. ఎమ్మెల్యేల సిఫార్సులు చెల్లక పోవడంతో వీరితో పనేముంది అంటూ తప్పించుకుంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతం జగన్ టూ జనం అన్న రీతిలో పరిస్థితులు మారడం జనానికి జగన్ ఫోటో తప్ప ఎమ్మెల్యేల కానరావడం లేదంటూ ఎమ్మెల్యేలు మాత్రం బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు.