వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి నిపుణుల కమిటీ నియామకం

 

 వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టులో చిన్నకదలిక వచ్చింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిపుణుల కమిటీని నియమిస్తూ జీ.ఓ.714 జారీ చేసింది. ఈ కమిటీ వైజాగ్ మెట్రో రైలు కోసం జీవీయంసి సూచించిన నాలుగు కారిడార్లలో ఒకదానిని ఖరారు చేస్తుంది. ఈ ప్రాజెక్టును సర్వేచేసి నివేదికను రూపొందించేందుకు ఆరు అంతర్జాతీయ సంస్థలు టెండర్లు వేసాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వాటి అర్హతలను, గత అనుభవాన్ని, పనితీరు, సామర్ధ్యాన్ని పరిశీలించి వాటిలోనుండి ఒకదానిని ఎంపిక చేసి జీవీయంసికి సూచిస్తారు. అప్పుడు జీవీయంసి రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి, నిధులు మంజూరు అయిన తరువాత ఆ సంస్థకు పని అప్పగిస్తుంది. నిపుణుల కమిటీ సమావేశమయ్యి సర్వే కోసం సంస్థ ఎంపిక, దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, కేంద్రప్రభుత్వం నుండి నిధుల మంజూరు అవడం, తరువాత సర్వే చేయడానికి, మళ్ళీ ఆ నివేదిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేందుకు అవసరమయిన అనుమతులు, నిధులు మంజూరు, భూసేకరణ వంటి సుదీర్ఘమయిన తతంగం అంతా పూర్తవడానికి కనీసం ఒకటి నుండి రెండేళ్ళు పట్టే అవకాశం ఉంది. అంటే అన్నీ సవ్యంగా సాగితే 2016 లేదా 2017సం.లో ప్రాజెక్టు పనులు మొదలయినట్లయితే బహుశః 2019 ఎన్నికల సమయానికి ఈ ప్రాజెక్టు కొంతమేర పూర్తయ్యే అవకాశం ఉందని భావించవచ్చును.