జనసేనలో చంద్రబాబు కోవర్టులు

 

విభజన హామీలపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి సరిగా అమలు కాలేదని విమర్శించారు. శంకుస్థాపనలతో చంద్రబాబు జనాలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రతి రాజకీయ పార్టీతో కాపురం చేశారని,ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు తూట్లు పొడిచారని విమర్శించారు.

చంద్రబాబు పవన్‌తో గతంలో వివాహం చేసుకుని విడాకులు ఇచ్చి.. మళ్లీ పవన్‌ను వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. చంద్రబాబుకు నారా పవన్‌ రాహుల్‌ నాయుడని సముచితమైన పేరు ఉందని వ్యాఖ్యానించారు. "ఖమ్మం లో గెలిచిన 2 ఎమ్మెల్యేలను చంద్రబాబే టిఆర్ఎస్ కి ఫిరాయించమన్నారు . తన కోవర్టులను కాంగ్రెస్ లో చేర్పించి నాశనం చేసారు. జనసేన లోకి కోవర్టులను పంపించి పవన్ ను తప్పుదారి పట్టిస్తున్నాడు. చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయం అన్ని వేళలా, అంతటా పనిచేయదు. 5 నెలలు వేచి చూద్దాం" అని ట్విటర్‌ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.