విజయమ్మ ఢిల్లీ యాత్రలు

 

 

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల తీరును కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు రాష్ట్రపతి తో భేటి అయ్యారు. అంతా బాగానే వుంది కాని రాష్ట్రపతిని ఇప్పటి వరకూ ఏ పార్టీ నాయకుడు ఇన్ని సార్లు కలవలేదు. రాష్ట్రపతిని విజయమ్మ ఇన్ని సార్లు కలవడం వెనుక మతలబు ఏమిటి? అని రాజకీయ విశ్లేషకులు చర్చి౦చుకుంటున్నారు. ఇది మర్యాదపూర్వక సమావేశం అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పట్టికీ, దీనికి ఏమైనా ప్రాధాన్యత ఉందా అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.

 

రాష్ట్రపతిగా ప్రతిభ పాటిల్ వున్నప్పుడు గుర్తుకురాని ప్రజాసంక్షేమం... విజయమ్మ కి ప్రణబ్ ముఖర్జీ వచ్చిన తరువాత తరుచుగా గుర్తుకు రావడం ఆశ్చర్యం. అలాగే  రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ని మర్చిపోయి... ఢిల్లీలో వున్న రాష్ట్రపతి కి  సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల పై ఫిర్యాదు చేయడం ఏంటీ? అని విమర్శలు వున్నాయి. జగన్ కాంగ్రెస్ లో ఎప్పటికైనా కలిసిపోతారనేవారి ఊహగానాలకు ఊతమిచ్చేలా విజయమ్మ ప్రయత్నాలు సాగడం విశేషం.



కేంద్ర ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ఉన్నప్పుడు జగన్ పట్ల కాస్త సానుకూలంగా ఉన్నారన్న భావన ఉండేది.  అయితే ఆయన వ్యక్తిగతంగా చేయగలిగేది తక్కువగా ఉంటుందని, మర్యాద కోసమే తాము రాష్ట్రపతిని కలిశామని పార్టీ నేతలు వివరిస్తున్నా... ప్రణబ్ కు ఉండే పలుకుబడి ఎటూ ఉంటుంది. కాబట్టి ఏదైనా రాజీకోసం వీరు ప్రయత్నిస్తున్నారా? అన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. ఇదంతా ఇలా వుంచితే...



ఈ విజయమ్మ ఢిల్లీ యాత్రల మీద ఏ రాజకీయ పార్టీలు నోరు ఎందుకు మెదపడంలేదంటే... తెలంగాణలో తెలంగాణ అంటూ...సీమాంద్రలో చంద్రబాబు వల్లే తెలంగాణ వచ్చింది అంటూ కాంగ్రెస్ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూంటే.. ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆత్మరక్షణలో పడిపోయి..విజయమ్మ గురుంచి పట్టించుకొనే స్థితిలో లేదు.