మోడీ అమిత్ షా ఆశీసులతోనే జగన్ నిర్ణయాలు: విజయ్ సాయి రెడ్డి

 

జగన్ ప్రభుత్వం ఒక పక్క పీపీఏల సమీక్ష, మరో పక్క పోలవరం రివర్స్ టెండరింగ్ లపై తీసుకున్న నిర్ణయాల పై కేంద్రం లోని మోడీ సర్కార్ సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అడ్డుకునే విషయంలో తమ ప్రభుత్వానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండర్లు, గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) గురించి ప్రస్తావించారు. మోదీతో మాట్లాడాకే తమ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని అయన స్పష్టం చేశారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని, వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకు రావాలనేదే తమ దృఢసంకల్పమని అయన చెప్పారు.

పీపీఏల సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ లపై జగన్ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం లేఖలు రాయడంతో పాటు, పోలవరంపై పోలవరం అథారిటీ చైర్మన్ ని నివేదిక అడిగిన సంగతి తెలిసిందే. మరి కేంద్రం అలా చేస్తుంటే, మరోవైపు విజయ సాయి ఏమో అంతా మోడీకి, అమిత్ షా కి చెప్పే చేస్తున్నాం అంటున్నారు. దీని వెనుక మర్మం ఏమిటో ఆ జగన్నాథుడికే తెలియాలి.