పెద్దిరెడ్డి గన్ మ్యాన్ పై సస్పెన్షన్ వేటు

వైసీపీ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మ్యాన్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  పుంగనూరు ఎమ్మెల్యేగా   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. అయితే సెక్యూరిటీ వ్యవహారాలు చూడాల్సిన గన్ మ్యాన్ పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో పెద్దిరెడ్డి గన్ మ్యాన్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కాలేషాను సస్పెండ్ చేస్తూ చిత్తూరు ఎస్పీ శుక్రవారం (జులై 25) ఉత్తర్వులు జారీ చేశారు.  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు,  రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.  కుమారుడిని పరామర్శించేందుకు బుధవారం (జులై23) పెద్దిరెడ్డి కుటుంబంతో సహా రాజమండ్రి వెళ్లారు. ఆ సమయంలో కోర్టు మిథున్ రెడ్డికి కల్పించిన ప్రత్యేక వసతులు దిండు, దుప్పటి, ఆహార పదార్థాలను తీసుకువెళ్లారు. వీటిని గన్ మ్యాన్ మోసుకుని జైలులోకి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భద్రత చూడాల్సిన ఉద్యోగి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గన్ మ్యాన్ కాలేషా సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చింది.  చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కాలేషా పెద్దిరెడ్డి గన్ మ్యాన్ గా చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సర్వీసు నిబంధనలు అతిక్రమించడంతో  ప్రభుత్వం  సస్పెండ్ చేసింది. అయితే పెద్దిరెడ్డి గన్ మ్యాన్ సస్పెన్షన్ పై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  పెద్దిరెడ్డిపై అక్కసుతోనే గన్ మ్యాన్ ను సస్పెండ్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.  
పెద్దిరెడ్డి గన్ మ్యాన్ పై సస్పెన్షన్ వేటు Publish Date: Jul 25, 2025 10:15PM

బద్వేలులో నకిలీ ముఠా గుట్టురట్టు

  కడప జిల్లాలో నకిలీ పట్టాల దందాకు పేరుగాంచిన బద్వేల్ లో మరోసారి నకిలీ భాగోతం బయట పడింది . మూడేళ్ల క్రితం ఇలాంటి ముఠాల గుట్టు రట్టు చేసి భారీ ఎత్తున నకిలీ పత్రాలు,సీల్లు స్వాధీనం చేసుకుని . సుమారు 20 మందిపై ప్పట్లో కేసులు  నమోదు చేశారు. తాజాగా ఇదే తంతు మరోసారి బద్వేల్లో కలకలం రేపింది. డికెటి పెట్టాలు, పాస్ బుక్ లు, అనుబంధ పత్రాలు సృష్టించే వారి బాగోతం బయట పడింది. పదిమంది కలిగిన ముఠాపై  పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మహిళతో పాటు తొమ్మిది మంది ని అరెస్ట్ చేసి ఆ వివరాలను  పోలీసులు  వెల్లడించారు.  బద్వేలు పట్టణంలో నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలపై కొద్దిరోజులుగా పోలీసులు లోతుగా విచారిస్తూ వచ్చారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక ఇంటి పట్టాకు సంబంధించి  విచారణ చేపట్టడంతో  బారీగా నకిలీ వ్యవహారం బయట పడింది. పట్టణంలో నకిలీ పట్టాల సృష్టి, దొంగ సీల్ల తయారీ వ్యవహారం చాలా కాలంగా సాగుతున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. ఆ మేరకు సమగ్రంగా విచారించి వీటిని స్వాధీనం చేసుకొని పదిమందిపై  కేసు నమోదు చేశారు.  మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్ల పేర్కొన్నారు . బద్వేలులో నకిలీ గుట్టు రట్టు చేసిన  పోలీసులు, నిందితుల నుంచి నకిలీ పట్టాలు, అనుబంధ ఫారాలు, పాసుబుక్కులు, రెవిన్యూ అధికారుల నకిలీ సీళ్లతో పాటు పలు కీలకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా ఎంతకాలంగా  నకిలీ పత్రాల ద్వారా ప్రజలను మోసం చేస్తుంది.ఇంకా ఎన్ని ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించారు అనే అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.  
బద్వేలులో నకిలీ ముఠా గుట్టురట్టు Publish Date: Jul 25, 2025 9:20PM

హెచ్‌సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్టు

  హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌‌లో జరిగిన అవినీతి వ్యవహారాల కేసులో సంస్థ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ను   పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ అధికారులు అతడిని పుణేలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దేవరాజ్‌ ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఫేక్ డ్యాక్‌మేంట్స్ సృష్టించి ఆయన అధ్యక్ష పదవిని పొందినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు పదిహేను రోజుల క్రితం వెల్లడించారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. మరోవైపు అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ ఇచ్చింది. మరోవైపు, జగన్మోహన్‌రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని వేసిన CID పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్మోహన్‌రావు, సునీల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని కోర్టు పేర్కొంది.
హెచ్‌సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్టు Publish Date: Jul 25, 2025 9:02PM

పార్లమెంట్ సమావేశాలు... తొలి వారం వృధా

  గత సోమవారం (జూలై 21) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. అయితే,తొలి వారం సమావేసాలు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగింది లేదు. పహల్గాం ఉగ్రదాడి,ఆపరేషన్ సిందూర్’తో, ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణకు సంబందించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వివాదాస్పద మధ్యవర్తిత్వం వ్యాఖ్యలతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం బీహార్’లో చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్‌)పై  చర్చ చేపట్టాలని విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంబింప చేయడంతో, అర్థవంతమైన చర్చ ’ఏదీ జరగ కుండానే తొలివారం పార్లమెంట్ సమావేశాలు ముగిసి పోయింది.   ఈ నేపధ్యంలో శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో, వచ్చేవారం ప్రారంభంలో, (సోమ మంగళ వారాల్లో) ఆపరేషన్ సిందూర్' పై పార్లమెంటు ఉభయసభల్లో 32 గంటలపాటు ప్రత్యేక చర్చ చర్చ చేపట్ట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సోమవారం లోక్‌సభలో చర్చ అనంతరం మంగళవారం రాజ్యసభలో చర్చ ఉంటుందని చెప్పారు. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు వివరించారు. 'పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారం ప్రత్యేక చర్చకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. విపక్షాలు పలు అంశాలు లేవెనెత్తాలని కోరుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చను చేపట్టేందుకు మేము అంగీకరించాం' అని రిజిజు తెలిపారు.చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు విపక్షాలకు చెప్పామని, అయితే మొదటి రోజు నుంచీ విపక్షాలు పార్లమెంటు లోపల, వెలుపల ఆందోళన చేపట్టాయని రిజిజు అన్నారు. మొదటి వారంలో కేవలం ఒకే బిల్లు ఆమోదించామని,సభను సజావుగా సాగేలా చూడాలని విపక్షాలను కోరినట్టు చెప్పారు.నిబంధనల ప్రకారం వారు ఏ అంశాన్నైనా లేవనెత్తొచ్చని, పార్లమెంటు పనిచేయకపోతే దేశానికి నష్టం జరుగుతుందని అన్నారు. అయితే, చర్చకు ప్రధానమంత్రి నరేంద మోదీ సమాధానం ఇవ్వాలన్న విపక్షాల, ముఖ్యమంగా ప్రతిపక్ష నేత రాహుల గాంధీ చేస్తున్న డిమాండ్’ను రిజిజు తిప్పికొట్టారు. ప్రభుత్వ పక్షాన ఎవరు మాట్లాడాలి, ఎవరు సమాధానం చెప్పాలి అనేది విపక్షాలు ఎలా నిర్ణయిస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈసందర్భంగా రిజిజు, వితండ వాదంతో విపక్షాలు సభా సమయాన్ని , ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాయని విమర్శించారు.  అదలా ఉంటే, సబాహ కార్యక్రమాలను సజావుగా జరుపుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్‌) వివాదం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు , ఎస్ఐఆర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంటే, ఎన్నికల సంగహం ససేమిరా అంటోంది.  మరోవంక రాజ్యాంగ సంస్థ కేంద్ర  ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమంపై పార్లమెంట్’లో చర్చించే ప్రశ్నే లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవంక, ఎస్ఐఆర్‌ను ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ గట్టిగా సమర్థించుకున్నారు. నకిలీ ఓటర్లు ఓటేయడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో అసలైన ఓటర్లను తీసివేస్తున్నామన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు. ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. ఈ నేపద్యంలో, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఎంతవరకు అమలవుతుందో చూడవలసిందే   
పార్లమెంట్ సమావేశాలు... తొలి వారం వృధా Publish Date: Jul 25, 2025 8:27PM

ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియామకం

  తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాలకు పదిమంది స్పెషల్ ఆఫీసర్‌లుగా సీనియర్  ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సి.హరికిరణ్, నల్గొండకు అనిత రామచంద్రన్, హైదరాబాద్ కు ఇలంబర్తి, ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్, నిజామాబాద్‌కు  హనుమంతు, రంగారెడ్డికి దివ్య, కరీంనగర్‌కు సర్ఫరాజ్ అహ్మద్, మహబూబ్ నగర్ కు రవి, వరంగల్ కు కె. శశాంక, మెదక్ జిల్లాకు ఎ.శరత్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల పరిస్థితులపై వీరు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. 
ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియామకం Publish Date: Jul 25, 2025 8:00PM

మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేం : జైళ్ల శాఖ

    ఏపీ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కల్పించే సౌకర్యాలపై దాఖలైన పిటిషన్‌పై  జైళ్ల శాఖ తాజాగా స్పందించింది. ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జైలులో ఆయనకు ఇంటి భోజనం అనుమతించలేమని.. అటెండర్‌ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ పేర్కొంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని మిథున్‌రెడ్డిని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. మిథున్‌రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.  జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వెస్ట్రన్ కమోడ్‌తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సహాయకుడు, అవసరమైన మందులు, మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్, పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టెలివిజన్‌ను అనుమతించాలని కోర్టు పేర్కొంది.
మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేం : జైళ్ల శాఖ Publish Date: Jul 25, 2025 7:37PM

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. 250 కుటుంబాలు దత్తత

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై సమీక్షలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆయన ఆవిష్కరించారు. పేదరిక నిర్మూలనకు పేద కుటుంబాలను దత్తత తీసుకున్నాని సీఎం తెలిపారు.  అంతే కాకుండా పేదరిక నిర్మూలనలో తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి సర్కార్ లక్ష్యం అని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో భాగం కావాలని, కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు.  
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. 250 కుటుంబాలు దత్తత Publish Date: Jul 25, 2025 6:44PM

వైసీపీ ఎమ్మెల్సీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో  చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు తీర్పు ఇచ్చింది. దళిత యువకుడు, మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కేసులో తదుపరి విచారణను కొనసాగించవచ్చుని ఇటీవల ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.  తమకు న్యాయం చేయాలని.. ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతబాబుకు సహకరించిన వారిపై సిట్  ఫోకస్ పెట్టింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసే యోచనలో ఉంది. డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడుగా ఉన్నారు. 2022 మే 19న కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగింది.  డ్రైవర్‌ను హతమార్చిన ఎమ్మెల్సీ అనంతబాబు.. మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  తానే మర్డర్ చేశానని అనంతబాబు అంగీకరించారని మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు పంపారు. తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. తమకు న్యాయం చేయాలని.. ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. 
 వైసీపీ ఎమ్మెల్సీకి హైకోర్టులో ఎదురుదెబ్బ Publish Date: Jul 25, 2025 6:15PM

ఆ ప్రశంసలు.. దేనికి సంకేతం ?

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి దూరం పెరిగిందని, ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా, అధినాయకుడి అప్పాయింట్మెంట్  దొరకడం లేదని, అదొక అందని ద్రాక్షగా మిగిలిందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అందులో ఎంత నిజం వుంది. ఎంత లేదు అనే విషయాన్ని పక్కన పెడితే,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ యాత్ర, ఏడాది కరవును కడిగేసింది.  తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరిట నిర్వహించిన కులగణన గురించి రేవంత్‌ రెడ్డి  గురువారం (జూలై 24) ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు.ఒక్క రాహుల్ గాంధీ కాదు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇతర పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. అన్నిటినీ మించి, సోనియా గాంధీ, లేఖ ద్వారా అందించిన ప్రశంసలు, రేవంత్ రెడ్డిని ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. అందుకే, ఆయన సోనియా రాసిన లేఖను, తనకు దక్కిన జీవిత సాఫల్య పురస్కారంగా,ఆస్కార్ అవార్డుగా, నోబెల్ పురస్కారంగా పేర్కొన్నారు. అంతే కాదు, కుర్చీ ఉన్నా లేకున్నా, ఈ జీవితానికి ఇది చాలు’ అంటూ సంతోషాన్ని వ్యక్త పరిచారు. అదలా ఉంటే, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు రాజకీయంగా ఏకమై కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తే దేశవ్యాప్తంగా 60-70 శాతం ప్రజల మద్దతు లభించినట్లేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అప్పుడే సామాజిక న్యాయం సాధించగలమన్నారు. కులగణనను ప్రధానాంశంగా లేవనెత్తిన ఘనత రాహుల్‌గాంధీకే దక్కుతుందని ప్రశంసించారు.
ఆ ప్రశంసలు.. దేనికి సంకేతం ? Publish Date: Jul 25, 2025 5:22PM

డీలిమిటేషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలన్నా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ ఉంటుందన్న సర్వోన్నత న్యాయస్థానం చట్టంలో ఇది స్పష్టంగా ఉందని వెల్లడించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని సుప్రీంకోర్టును  ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది.  రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించ‌డం వ‌ల్ల‌ మిగతా రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాల‌తో పోల్చిన‌ప్పుడు రాష్ట్రాల‌లో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధ‌న‌లు భిన్నంగా ఉంటాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్నాది.   
డీలిమిటేషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు Publish Date: Jul 25, 2025 5:11PM

యూట్యూబ్ చూసి డైట్...యువకుడు మృతి

  యూట్యూబ్ చూసి డైట్ ఫాలో అయిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన శక్తిశ్వరన్ అనే వ్యక్తి  యూట్యూబ్‌లో వీడియో చూసి మూడు నెలలుగా  ఆహారం తీసుకోకుండా కేవలం నీరు, ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకున్నారు. నిన్న అతడికి ఊపిరాడక మృతి చెందారు. డైట్ ఫాలో కావడం కారణంగానే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు తెలిపారు.  బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని, కొన్ని మాత్రలు వాడుతున్నాడని తెలిపారు. గురువారం నాడు శక్తిశ్వరన్ ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
యూట్యూబ్ చూసి డైట్...యువకుడు మృతి Publish Date: Jul 25, 2025 4:08PM

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత

శాంతి గోదావరి వరద ఉధృతితో మహోగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి 175 గేట్లు ఎత్తి దాదాపు 2 లక్షల 16 వేల 300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు జలమయమయ్యాయి. పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదవరి వరద మరింత పెరిగే అవకాశం ఉందనీ, తోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  
గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత Publish Date: Jul 25, 2025 3:47PM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు ప్రిస్టీజియస్ అవార్డ్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ ప్రగతిని ఇస్తున్న అత్యధిక ప్రాముఖ్యతకు  గుర్తింపు దక్కింది. ఏపీ పర్యాటక శాఖకు అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.   10వ అంతర్జాతీయ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(ఐటీసీటీఏ) సంస్థ ఏపీలో చేప‌డుతున్న ప‌ర్యాట‌క ప్రాజెక్టులు.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలించి.. ఎమర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డు ను రాష్ట్రానికి  ఇచ్చింది.  శ‌నివారం(జులై 26) ఢిల్లీలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును ప‌ర్యాట‌క అభివృద్ది కార్పొరేష‌న్‌(ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, ఐఏఎస్ అధికారి ఆమ్ర‌పాలికి  అందించ‌నుంది. ఏపీ టీడీసీ ఎండీ అమ్రపాలి ఆ విషయాన్ని స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.   ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత విస్తారమైన తీర ప్రాంతం ఉన్న రోండో రాష్ట్రం. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని వినియోగించుకుని.. ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం న‌డుంబిగించింది. ఈ క్ర‌మంలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసింది.  అఖండ గోదావ‌రి  ప్రాజెక్టు ద్వారా.. రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క రంగంలో ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించింది. అదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్యాట‌క శాఖ‌కు ‘ప‌రిశ్ర‌మ‌’ హోదాక‌ల్పించారు. త‌ద్వారా రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగం ద్వారా.. ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌తో పాటు.. ఆదాయం కూడా పెరుగుతుందని అంచ‌నా వేశారు. ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వినూత్న విధానాలు, కొత్త పాలసీలు, విప్లవాత్మక సంస్కరణలకు ఆయ‌న పెద్ద‌పీట వేస్తున్నారు. వీట‌న్నింటిని గ‌మ‌నించిన ఇంటర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(  సంస్థ‌.. ఈ సారి మర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది.  ఈ అవార్డుతో రాష్ట్ర ప‌ర్యాట‌కం మ‌రింత పుంజుకునేందుకు.. విదేశీ ప‌ర్యాట‌క‌లు కూడా రాష్ట్రానికి మ‌రింత పెరిగేందుకు అవ‌కాశం ఉంద‌ని ఆమ్ర‌పాలి తన పోస్టులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు ప్రిస్టీజియస్ అవార్డ్ Publish Date: Jul 25, 2025 3:35PM

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు : హోం మంత్రి

  బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాల అంచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. వర్షాలు, ష్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందుస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు హోం మంత్రి ఆదేశించారు. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆదేశించారు.  రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై విపత్తు నిర్వహణ ఎండీ ప్రఖర్‌ జైన్‌, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ వైపు కదులుతుందన్నారు. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు.. రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెప్పారు.  తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. వరద ముప్పు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని హాట్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి అని కలెక్టర్లకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ లో  112, 1070, 1800-4250101 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలను ఆమె కోరారు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు : హోం మంత్రి Publish Date: Jul 25, 2025 3:20PM

శ్రీల‌క్ష్మి ఐఏఎస్ కి తెలంగాణ హైకోర్టు షాక్

ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందే . గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు  ఇదే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆ కేసునుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. అదే తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయంపై విచారించేందుకు సీబీఐ, ఈడీలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి నేతృత్వంలో జ‌రిగిన ఓబులాపురం మైనింగ్ అక్ర‌మాల వ్య‌వ‌హా రంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిని విచారించాల్సిందేన‌ని.. ఆ అక్రమాలలో ఆమె పాత్ర సుస్ప‌ష్టంగా ఉంద‌ని.. తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆమెను విచారించేందుకు సీబీఐ, ఈడీల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు తేల్చి చెప్పింది.  ఇదే కోర్టు గ‌తంలో గ‌నుల కేసులో శ్రీల‌క్ష్మికి ప్ర‌మేయం లేద‌ని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కేసు నుంచి త‌ప్పించాల‌ని సీబీఐ, ఈడీల‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సీబీఐ, ఈడీలు.. ఈ ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో శ్రీల‌క్ష్మి పాత్ర స్ప‌ష్టంగా ఉంద‌ని తెలుస్తోంద‌ని..  ఆమెను కేసు నుంచి ఎలా త‌ప్పిస్తార‌ని నిలదీస్తూ..  మ‌రోసారి దీనిపై హైకోర్టు విచార‌ణ చేసి.. ఆదేశాలు ఇవ్వాల‌ని పేర్కొంది. దీంతో హైకోర్టులో మ‌రోసారి శ్రీల‌క్ష్మి.. త‌నను ఈ కేసు నుంచి త‌ప్పించాల‌ని కోరుతూ.. రివిజ‌న్ పిటిష‌న్ దాఖలు చేశారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో శ్రీల‌క్ష్మి కేసును విచారించాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. సీబీఐ వాదనలు వినకుండా గ‌తంలో ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఉప‌సంహ‌ రించుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది.  వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కేటాయించిన ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి అన్ని అనుమతులనూ శ్రీల‌క్ష్మి  ఇచ్చార‌ని.. ఆమె ఉద్దేశ పూర్వకంగానే ఈ అక్ర‌మాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నీ సీబీఐ ఆరోపిస్తోంది.  అయితే,  ప్ర‌భుత్వం తీసుకున్న విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు మాత్ర‌మే తాను అనుమ‌తి ఇచ్చాన‌ని, అధికారిగా త‌న పాత్ర పోషించాన‌ని శ్రీల‌క్ష్మి చెబుతున్న శ్రీలక్ష్మి ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోరుతున్నారు. 
శ్రీల‌క్ష్మి ఐఏఎస్ కి తెలంగాణ హైకోర్టు షాక్ Publish Date: Jul 25, 2025 3:12PM

కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్‌ఫ్యూజన్

వరుస పరాజయాలు మూటగట్టుకున్న గులాబీ పార్టీలో నెలకొన్న వివాదాలు, ఆధిపత్యపోరు ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారు పార్టీని తిరిగి రేసులోకి తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యనేతలు,  అందులోనూ కల్వకుంట్ల వారసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ వర్గాకు అసలు మింగుడుపడటం లేదంట.  తాజాగా కవిత జాగృతి వర్సెస్ పార్టీ అనుభంద సంస్థ బీఆర్ఎస్వీ పోటాపోటీగా ఓకే రోజూ శిక్షణ తరగతులు, వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. ఒకే రోజు జాగృతి ఒకవైపు.. బీఆర్ఎస్వీ మరోవైపు కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో ఆధిపత్య పోరు అన్నాచెల్లెళ్ల సవాల్ అన్నట్లుగా మారిందనే చర్చ నేతల్లో నడుస్తోంది. జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉంది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే రోజు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ కేడర్ లో మాత్రం గందరగోళానికి తెరదీసిందట. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత ఇద్దరూ కీలక నేతలు. ఇద్దరూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసులే. పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నప్పటికీ సొంత జాగృతి సంస్థ బలోపేతంపైనే ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జాగృతి ఆధ్యర్యంలోనే కార్యక్రమాలు చేపడుతూ యాక్టివ్ అవుతున్నారు. కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ విద్యార్థి విభాగం నేతలను పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  అయితే ఒకే రోజు ఇటు జాగృతి శిక్షణ తరగతులు, అటు బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేదికలు వేర్వేరు ప్రాంతాలు అయినప్పటికీ ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు కల్వకుంట్ల వారసులు  ప్రకటించారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే లీడర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత రెండు సెషన్లుగా నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్వీ సదస్సుకు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలు హాజరై రెండు సెషన్లలో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో ఆయోమయానికి, గందరగోళానికి కారణమైందట.  ఎందుకు ఒకేసారి అన్నచెల్లెలు ఒకే సారి వేర్వేరుగా ప్రోగ్రాంలను ఫిక్స్ చేశారు?  అసలు కారణం ఏంటి?  ఒకరు ఒక తేదీలో.. మరొకరు ఇంకో తేదీలో శిక్షణ తరగతులు నిర్వహించవచ్చుకదా? అన్న చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. ఆ క్రమంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది తెలియక కేడర్ లో అయోమయం నెలకొందట. కవిత యువత, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో జాగ‌ృతిని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. యువత, మహిళలు, బహుజనులు రాజకీయాల్లో రావాలని ప్రతీ సందర్భంలోనూ పిలుపునిస్తున్నారు.  అందులో భాగంగానే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలుత రాష్ట్రస్థాయిలో ‘లీడర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం (జులై26)  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ  కార్యక్రమం నిర్వహించనున్నట్లు  ఆమె గత నెల 15నే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జాగృతి ప్రతినిధులు రావాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్ ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యులందరికీ కేసుల చట్రం బిగుసుకుంటుండటంతో... చిన్నబాస్‌కు పార్టీ నేతల సహకారం  పూర్తి స్థాయిలో లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయినా తనదైన వ్యూహాలు అమలు చేస్తున్న కేటీఆర్  బనకచర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను బీఆర్ఎస్వీకి అప్పగిస్తూ తాజా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అందుకు తగ్గట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యచరణ సిద్ధంచేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై జంగ్ సైరన్ మోగించేందుకే ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 26న ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం ఉదయం సెషన్ ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభిస్తుండగా... సాయంత్రం సెషన్ లో కేటీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని చూస్తున్నారు. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఎవరికి వారే పార్టీ తమకు ప్రాణం అంటూనే .. ఎవరికి వారు సొంతంగా యాక్షన్‌ప్లాన్లు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోకపోయినా.. ఎవరికి వారు సొంత కార్యచరణ మేరకు ముందుకు సాగడం చూస్తుంటే.. వారిరువురి తీరు   గులాబీ పార్టీని మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయన్న అభిప్రాయం పార్టీ లీడర్లు, క్యాడర్ లో వ్యక్తమౌతోంది.
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్‌ఫ్యూజన్ Publish Date: Jul 25, 2025 2:54PM

బీజేపీ అధిష్టానంతో విభేదాలే ధన్ ఖడ్ నిష్క్రమణకు కారణం?

ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా కు న్యాయమూర్తి వర్మ ఉదంతమే ప్రధాన కారణమని దాదాపుగా నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుల సంతకాలతో వర్మ అభిసంసన తీర్మానం ఆమోదించమే  ధన్ ఖడ్  నిష్క్రమణ కు కారణమైంది. అంతకు ముందే బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాలకు ఇది క్లైమాక్స్ గా భావించాల్సి ఉంటుందంటున్నారు. దన్ ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ మక్తసరి స్పందన, అలాగే రాజీనామా ఉపసంహరణకు ఎలాంటి బుజ్జగింపులు లేకుండా తక్షణ ఆమోదమే ఇందుకు తార్కాణగా చెబుతున్నారు. ఆయన ధిక్కార వైఖరి పట్ల  ఆగ్రహంతో ఉన్న బీజేపీ పెద్దలు ఆయనపై అభిశంసన పెట్టాలని కూడా ఒక దశలో ఆలోచన చేశారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఆయనకు గౌరవ విడ్కోలు పలుకుదామన్న కాంగ్రెస్ ప్రతిపాదన ను కూడా ప్రభుత్వం తిరస్కరించడం కమలనాథులకు ఆయన పట్ల ఉన్న ఆగ్రహ స్థయిని తెలియజేస్తున్నదని చెప్పాల్సి ఉంటుంది. ప్రొటోకాల్ విషయంలో ధన్ ఖడ్ కు కేంద్రానికి  విభేదాలు ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ పర్యటనలో ఈ విషయం ప్రస్ఫుటంగా బయటపడింది. జేడీవాన్స్ తనను కలవకపోవడం వెనుక కేంద్రం పాత్ర ఉందని ధన్ ఖడ్ ఆ సమయంలో బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాహనాల విషయంలో, మంత్రుల కార్యాలయాల్లో ఫోటోల విషయంలో  కూడా ధన్ ఖడ్, కేంద్రం మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. వి రైతుల గిట్టుబాటు ధర విషయంలో  ధన్ ఖడ్ కేంద్రమంత్రిని నిలదీయడం వంటి సంఘటనలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ వ్యవహారం కూడా ధన్ ఖడ్ కు కేంద్రానికి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది.  ఇక చివరిగా రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఖర్గేకు  అధికారపక్ష నేత నడ్డా కంటే ఎక్కువ సమయాన్ని ధన్ ఖడ్ కేటాయించడం ఈ విభేదాలకు పరాకాష్టగా మారింది.  ఇక న్యాయమూర్తి వర్మ అభిశంసన వ్యవహారంలో  న్యాయవ్యవస్థను కూడా బాధ్యత వహించేలా చేయాలంటూ కేంద్రం ఆశలపై ధన్ ఖడ్ నీళ్లు చల్లడంతో  బీజేపీ పెద్దల ఆగ్రహం పీక్స్ కు చేరిందని పరిశీలకులు అంటున్నారు.  ఎన్డీయే ఎంపీల సంతకాలు లేకుండా ప్రతిపక్షాల తీర్మానాన్ని ఆమోదించవద్దని మూడు సార్లు ప్రభుత్వ పెద్దలు   ధన్ ఖడ్ కు సూచించినా ఆయన పట్టించుకోలేదు. ఇలా కేంద్రంతో ఆయన కు పొసగలేదనీ, దీంతో అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. హమ్మయ్య అనుకుని కేంద్రం వెంటనే ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నదానిపై కసరత్తులలో మునిగిపోయింది.  
బీజేపీ అధిష్టానంతో విభేదాలే ధన్ ఖడ్ నిష్క్రమణకు కారణం? Publish Date: Jul 25, 2025 2:27PM

గోవాకు అశోకగజపతి రాజు.. గవర్నర్ గా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిర రాజు శుక్రవారం (జులై 25) గోవాకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాకు బయలు దేరారు. గోవా గవర్నర్ గా నియమితులైన ఆయన శనివారం (జులై 26) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు విజయనగరం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో గోవాకు చేరుకుంటున్నారు.  గోవా గవర్నర్ గా నియమితులైన తరువాత అశోకగజపతి రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన అశోకగజపతి రాజు పార్టీతో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ  తెలుగుదేశంతోనే ఉన్న అశోకగజపతి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం లోక్ సభ సస్థానం నుంచి ఒక సారి ఎంపీగా విజయం సాధించిన అశోకగజపతి రాజు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.  
గోవాకు అశోకగజపతి రాజు.. గవర్నర్ గా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే? Publish Date: Jul 25, 2025 2:05PM

మోదీ మరో మెట్టు పైకి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ  విశ్వాసాలతో, ఆయన పరిపాలనా విధానాలతో ఎవరైనా విభేదించవచ్చుకానీ.. భాతర రాజకీయాల్లో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ  కాదన లేరు. నిజానికి.. స్వతంత్ర భారత రాజకీయాల్లో, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా  ఆరు వరస విజయాలను సొంతచేసుకున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ. వరసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యంత్రిగా విజయం సాధించిన మోదీ..  భారత ప్రధానిగా వరసగా 2014, 2019, 2024లో  హ్యాట్రిక్ సాధించి  డబుల్’ హ్యాట్రిక్’ సాధించిన ఏకైక నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచి పోయారు.  ఇక ఇప్పుడు మోదీ మరో రికార్డు ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంతవరకు దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానిగా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరున ఉన్న రికార్డును మోదీ సొంత చేసుకున్నారు. ఇందిరాగాంధీ.. 1966 జనవరి  నుంచి 1977 మార్చి  వరకు 4 వేల 77 రోజులు ప్రధాని పదవిలో కొనసాగారు.  కాగా.. 2014 మే 26 న తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ  శుక్ర వారం (జూలై 25, 2025)తో 4,078 రోజులు పూర్తిచేసుకుని ఇందిరాగాంధీ రికార్డు ను అధిగమించి దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. కాగా.. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో కొనసాగారు.  అనుకోకుండా ఎమ్మెల్యే అయినా కాకుండానే..  2001లో నేరుగా ముఖ్యమంత్రిగా గుజరాత్ శాసనసభలో కాలు పెట్టిన మోదీ 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా పార్లమెంట్ లో తొలి అడుగు పెట్టారు. మోదీ నాయకత్వంలో   బీజేపీ  2014లో 272 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది.  2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది  ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది.  2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ..  ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లో 30 ఏళ్లుగా సాగుతున్న సంకీర్ణ రాజకీయాలకు చుక్కపెట్టిన నేతగా.. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్సేతర  ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు.
మోదీ మరో మెట్టు పైకి! Publish Date: Jul 25, 2025 12:25PM

తెలంగాణ క్యాబినెట్‌ భేటీ వాయిదా

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం (జులై 25) జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారవర్గాలు తెలియజేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మంత్రులు  పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఈ కేబినెట్ భేటీ సోమవారం మధ్యాహ్నం జరిగే అవకాశం ఉందని అధికా రవర్గాల సమాచారం.
తెలంగాణ క్యాబినెట్‌ భేటీ వాయిదా Publish Date: Jul 25, 2025 12:04PM

భార‌తీయుల‌కు ఉద్యోగాలివ్వొద్దు.. ట్రంప్ కామెంట్ల కాక‌

హ‌లో ట్రంప్ ఎక్స్ క్యూజ్  మీ.. మీ దేశంలో మా వాళ్ల ప‌నితీరుకు ఆయా కంపెనీలు ఏం రేంజ్ లో లాభాల బాట‌లో ఉన్నాయో తెలుసా.. తెలియకపోతే ఒక్క‌సారి ఈ వివ‌రాల‌ను చూడండి. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా  పని చేస్తున్నారు సత్య నాదేళ్ల. హైదరాబాద్ లో జన్మించిన ఆయన మైక్రో సాఫ్ట్ ను క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ లీడర్ గా తీర్చి దిద్దారు. ఒకప్పుడు 300 బిలియన్ డాలర్లు గల ఈ సంస్థను 3 ట్రిలియన్ డాల్లకు పైగా పెంచారు. మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్శిటీ నుంచి ఎంఎస్, చికాగో యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. తన శక్తి సామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించి సత్యా నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ని ఒక మహా వృక్షంగా విస్తరింప చేసిన పేరు సాధించారు. గుగుల్ సీఈవోగా మోస్ట్ పాపులర్ అయిన సుందర్ పిచాయ్.. 2015 నుంచీ ఈ సంస్థ కోసం పని చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. అంతకు ముందు గుగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ కి నాయకత్వం వహించారు. ఐఐటీ ఖరగ్ పూర్, స్టాన్ ఫోర్డ్, వార్టన్ నుంచి పట్టభద్రులైన సుందర్ పిచాయ్.. సారథ్యం వహిస్తున్న సంస్థ ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లకు పైగా టర్నోవర్ కలిగి ఉంది. ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్ మ్యాప్స్ ని చూస్తూ వాహనాలను నడుపుతున్నాం అంటే అదంతా సుందర్ పిచాయ్ ఐడియానే.   ఇక ఇంటర్నేషనల్ బిజినెస్ మిషీన్స్.. షార్ట్ ఫామ్ లో చెబితే.. ఐబీఎం కార్పొరేషన్ సీఈవో అరవింద్ కృష్ణ.. ఇల్లినాయిస్ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ఈ ఐఐటీ కాన్పూర్ విద్యార్ధి సారథ్యంలో నడుస్తోన్న ఐబీఎం ప్రస్తుత టర్నోవర్ 244 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులోని రెడ్ హ్యాట్ టర్నోవర్ 34 బిలియన్లు. ఇందుకు సారథ్యం వహించింది కూడా అరవిద్ కృష్ణే. అంతే కాదు హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ పైనా దృష్టి సారించి ఈ దిశగా కంపెనీ ముందుకు వెళ్లేందుకు నాయకత్వం వహిస్తున్నారు అరవింద్ కృష్ణ.   అడోబ్ సీఈవో శంతను నారాయణ్. 2007 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ 2024 నాటికి 250 బిలియన్ డాలర్లు. హైదరాబాద్ లో జన్మించిన నారాయణ్ అడోబ్ ని సబ్ స్క్రిప్షన్ ఆధారిత మోడ్ లోకి మార్చారు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలిచిందంటే ఇదంతా శంతను ఆలోచనల వల్ల మాత్రమే సాధ్యమైందని అంటారు. ఉస్మానియా, బౌలింగ్ గ్రీన్ స్టేట్, బర్కిలీ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందిన ఈయన తన సంస్థ  అంచెలంచలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు.   మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మల్హోత్రా.. 2017 నుంచి సంజయ్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా పని చేస్తున్నారు.  ఈ సంస్థ ఆదాయం 21 బిలియన్ డాలర్లు. బిట్సి పిలానీ, యూసీ బర్కిలీ గ్రాడ్యుయేట్. శాన డిస్క్ సహస్థాపకులైన సంజయ్.. సెమికండక్టర్ మెమరీలో మైక్రాన్ ని ముందుండి నడిపిస్తున్నారు.   పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా.. 2018 నుంచి ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా ఉంది.  ఐఐటీ వారణాశి, బోస్టన్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన అరోరా.. గతంలో గూగుల్, సాఫ్ట్ బ్యాంక్ లో సీనియర్ పొజిషన్లో వర్క్ చేశారు. పాలో ఆల్టో సైబర్ సెక్యూరిటీ పోర్ట్ ఫోలియోని మరింత బలోపేతం చేశారు.  ప్రస్తుతం ఆల్ఫాబెట్ యాజమాన్యంలో ఉన్న యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 2023 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. సుమారు 182 బిలియన్ డాలర్ల టర్నోవర్ గల ఈ సంస్థకు నీల్ మోహన్ సారథ్యం ఎంతో ప్రయోజనకరంగా మారింది. గతంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గానూ పని చేశారీ ఇండో అమెరికన్. ఈ ప్లాట్ ఫామ్ ని కమర్షియల్ గా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషించారు. దీంతో ఆయనకు నాయకత్వ బాధ్యతలను అప్పగించిందీ సంస్థ. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ రేష్మా కేవల్ రామణి 2020 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ బయో టెక్నాలజీ సంస్థ 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది.  ముంబైలో జన్మించిన రేష్మా బోస్టన్ లో వైద్య శాస్త్రంలో డిగ్రీ తీస్కున్నారు. జన్యు, కణ చికిత్సలను డెవలప్ చేస్తున్న యూఎస్ బేస్డ్ బయోటెక్ సంస్థకు తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా రికార్డు సృష్టించారు రేష్మా కేవల్. ఇక కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్.. 2023 నుంచి ఈ సంస్థ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 19 బిలియన్ డాలర్ల ఆదాయం గల ఈ సంస్థను ఇండో- అమెరికన్ అయిన రవి పరుగులు పెట్టిస్తున్నారు. ట్రాన్స్ యూనియన్ లో ఇండివిడ్యువల్ డైరెక్టర్ గానూ వర్క్ చేస్తున్నారు. అరిస్టా నెట్ వర్క్స్ సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్  2008 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 90 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల ఈ సంస్థకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు జయశ్రీ. ఈమె భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ అమెరికన్ కావడం విశేషం. అరిస్టాను క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలుపుతున్నారీమె. వేఫర్ సీఈఓ నీరాజ్ షా.. 2002లో స్థాపించిన ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులు కూడా. ఈ కామర్స్ లో ఫర్నిచర్, గృహోపకరణాల్లో 12 బిలియన్ డాలర్ల ఆదాయం ఈ సంస్థ సొంతం. ఇండో అమెరికన్ అయిన షా, వేఫర్ ను గృహోపకరణాల విభాగంలో ప్రముఖ ఆన్ లైన్ రీటైలర్ గా నిర్మించారు. ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రహ్మణ్యం 2022 నుంచి ఈ సంస్థ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. లాజిస్టిక్స్ లో ఈ సంస్థ 90 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన రాజ్ ఫెడ్ ఎక్స్- ప్రపంచ వ్యాప్త విస్తరణపై తనదైన ముద్ర వేశారు. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ 2019 నుంచి ఈ సంస్థ సారధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ విశ్వ విద్యాలయం, లాంకాస్టర్ వర్శిటీ నుంచి డిగ్రీలను పొందిన భూటాని వెబ్ హోస్టింగ్, డొమైన్ రిజిస్ట్రేషన్ లో గోడాడి విస్తరణకు నాయకత్వం వహిస్తున్నారు. అమన్ నాయకత్వంలోని ఈ సంస్థ 4 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది.    వీళ్లే కాక ఇక మీ స్సేస్, సాఫ్ట్ వేర్, మెడిక‌ల్, లా, త‌దిత‌ర రంగాల్లో గ‌ల భార‌తీయుల ప్ర‌తిభిపాట‌వాల విలువ అమెరికాకు ల‌క్ష  కోట్ల మేర ఉంటుంది. అంతేనా భార‌తీయులు అమెరికాకు ప‌న్ను క‌ట్టే వారి ప‌ర్సంటేజీలో 1. 5 శాతం వ‌ర‌కూ ఉన్నారు. ఇక్క‌డున్న కుల‌-మ‌త‌-వ‌ర్గ- వైష‌మ్యాల‌నే బాధ‌లు ప‌డ‌లేక అక్క‌డికి వ‌ల‌స వ‌చ్చిన మావాళ్లు.. మీ దేశాభివృద్ధిలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. వాళ్లే లేకుంటే మీ సంస్థ‌ల‌ ఆర్ధిక ప‌టుత్వం  నేల చూపులు చూసే అవ‌కాశ‌ముంది. ఐడియా ఎవ‌రైనా ఇస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేయ‌డంలోనే ఉంటుంది అస‌లు స‌త్తా. ఆ స‌త్తాగ‌ల భార‌తీయులు లేకుంటే మీ గ‌తి అధోగ‌ తే అన్న‌ది ప‌లువురు అంత‌ర్జాతీయ వాణిజ్య నిపుణులు అంటోన్న మాట‌.
భార‌తీయుల‌కు ఉద్యోగాలివ్వొద్దు.. ట్రంప్ కామెంట్ల కాక‌ Publish Date: Jul 25, 2025 11:21AM

కోర్టులో మళ్లీ చుక్కెదురు.. మరి కొన్ని రోజులు జైల్లోనే జూనియర్ పెద్దిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరి కొన్ని రోజులు జైలువాసం తప్పేటట్లు కనిపించడం లేదు. తనను ఏ4 నిందితుడిగా చేర్చిన నాటి నుంచి బెయిల్ కోసం గజనీ మహ్మద్‌లా విఫల యత్నాలు చేసుతున్న రాజంపేట ఎంపీ జూనియర్ పెద్దిరెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను  కోర్టు ఈ నెల 29కి  వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డి మరో నాలుగు రోజులు జైల్లోఉండక తప్పదు.  కా  మద్యం కుంభకోణం కేసులో   అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి  ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సహాయకుడిని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.  జైలులో ఖైదీలకు సహాయకుల్ని ఏర్పాటు చేసే నిబంధనలు లేవనీ, కోర్టు ఆదేశాల్లో ఉన్న మార్గదర్శకాలను పునః పరిశీలించాలని ఆయన ఆ రివ్యూ పిటిషన్ లో కోరారు.   జైలు నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నా, లేదా తీవ్రమైన అనారోగ్యానికి లోనైతే తప్ప ప్రత్యేక సహాయకుడిని నియమించే అవకాశం లేదని, అటువంటి పరిస్థితుల్లో జైలులో ఉన్న  సహాయ సిబ్బందిని ఉపయోగిస్తామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ముందుగా కోర్టు ఇచ్చిన అనుమతులతో ఎంపీకి జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై ఇప్పటికే కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఈ నెల 29న జరిగే విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. 
 కోర్టులో మళ్లీ చుక్కెదురు..  మరి కొన్ని రోజులు జైల్లోనే జూనియర్ పెద్దిరెడ్డి Publish Date: Jul 25, 2025 11:08AM

ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాణికి రిమాండ్

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ నెల్లూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల కబ్జాకు వెంకటాచలం తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై నమోదైన కేసుకు సంబంధించి నెల్లూరు అడిషన్ మేజిస్టేట్ కోర్టు ఈ ఉత్తర్వలు జారీ చేసింది. ఇప్పటికే మరో కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఫోర్జరీ చేసులో వర్చువల్ గా గురువారం (జులై 24) నెల్లూరు కోర్టులో హాజరు పరిచారు.  ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండానే కాకాణిని 14వ నిందితుడిగా చేర్చారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణిని 14 రోజుల పాటు అంటే ఆగస్టు 7 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ కు ఆదేశించింది. ఇళఆ ఉండగా కాకాణికి బెయిలు ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.  
ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాణికి  రిమాండ్ Publish Date: Jul 25, 2025 10:53AM

సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా?

సజ్జలపై కేసు సంగతి ఏమిటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాసిక్యూషన్ ను నిలదీసింది. అమరావతి మహిళలపై సజ్జల చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తున్నారా లేదా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సజ్జల దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఆ లోగా సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా తెలపాలని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.  సజ్జల అమరావతి ప్రాంత ప్రజలు, మహిళలను ఉద్దేశించి సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారన్న భయంతో సజ్జల ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ గురువారం జరిగింది. సజ్జల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదించారు.  ఆయన తన వాదనలో అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సజ్జలపై ఇప్పటి వరకూ కేసు నమోదు కాలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సజ్జల తరఫున వాదించిన పొన్నవోలు అరెస్టు చేస్తారన్న అనుమానం ఉన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఆధారంగా సజ్జలపై కేసు నమోదు చేస్తారా? చేయరా? అన్న విషయం తెలపాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశిస్తూ.. సజ్జలపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకూ పొడిగిస్తూ కేసు విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.  
సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా? Publish Date: Jul 25, 2025 10:40AM

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

కల్లోలంగా ఉన్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను పొడగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హింసాకాండ, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి విదితమే. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వం వైదొలగడంతో ఆక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.  తాజాగా అక్కడి పరిస్థితులు నెమ్మదినెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోనికి వచ్చే వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగించాని కేంద్రం నిర్ణయించింది. దీంతో   కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ అందుకు ఆమోదం తెలిపింది. వెంటనే తీర్మానాన్ని రాష్ట్రపది ద్రౌపది ముర్ముకు పంపగా ఆమె ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో  తీ మణిపుర్ మరో ఆరు నెలల పాటు అంటే ఫిబ్రవరి 2026 వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.  
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు Publish Date: Jul 25, 2025 10:19AM

పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి

రాజస్థాన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ దుర్ఘటన ఝలావర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం (జులై 25) ఉదయం ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు అంతలోనే మృత్యువాత పడటంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల దుఖానికి అంతులేకుండా పోయింది. ఝలావర్ లోని ప్రాథమిక పాఠశాల భవనం పై కప్పు ఈ ఉదయం పది గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు గాయపడగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది విద్యార్థులు చిక్కుకున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానికులు, పోలీసులు, అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.  
పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి Publish Date: Jul 25, 2025 10:07AM

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బెజవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అంచనాతో అధికారులు దుర్మమ్మ కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డును మూసివేశారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, భక్తులు సహకరించాలనీ అధికారులు కోరారు. వర్షాలు తెరిపి ఇచ్చి వాతావరణం కుదు టపడిన తరువాత మళ్లీ ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తామని తెలిపారు.  
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత Publish Date: Jul 25, 2025 9:56AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయంపడుతోందంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. మూమూలు రోజులలోనే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అలాంటిది శ్రావణమాసం అంటే ఇక చెప్పనే అవసరం లేదు. శుక్రవారం (జులై 25) నుంచి శ్రావణ మాసం ఆరంభం కావడం, అందులోనూ తొలి రోజే శుక్రవారం కావడం, వారాంతం సమీపిస్తుండటంతో    శుక్రవారం (జులై 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేసి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (జులై 24) శ్రీవారిని మొత్తం  68,800 మంది   దర్శించుకున్నారు. వారిలో 22,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం  నాలుగు కోట్ల 49 లక్షల రూపాయలు  వచ్చింది.  
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయంపడుతోందంటే? Publish Date: Jul 25, 2025 9:31AM

పిల్లలు అబద్ధం చెబుతుంటే!

  ప్రపంచంలో పిల్లల్ని పెంచడం అంత నైపుణ్యమైన పని మరొకటి ఉండదేమో! ఒక పక్క వారి ఆలనాపాలనా చూసుకుంటూ... మరో పక్క వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ సాగే ఈ ప్రయాణం ఏమంత సులువైంది కాదు. అలాంటి సమయంలో పిల్లలు అబద్ధం చెబుతున్నారని తేలిందనుకోండి... అంతే! తల్లిదండ్రుల ప్రతిస్పందన అసాధారణంగా ఉంటుంది. తమ పెంపకంలో ఏదో లోటు జరిగిపోయిందనో, పిల్లలు సరిగా ఎదగడం లేదనో తెగ బాధపడిపోతారు. శాశ్వతంగా పిల్లల పట్ల అనుమానపు దృక్పథాన్ని అలవర్చుకుంటారు. కానీ అంత అంతర్మధనం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వారేం చెబుతున్నారంటే... విశ్వాసం పెరిగితే నిజం చెబితే తల్లిదండ్రుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న భయమే చాలా అబద్ధాలకి కారణం అవుతుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మనపట్ల వారికి తగిన నమ్మకాన్ని కలిగించాల్సిందే! మనతో వారు ఎలాంటి సమస్యని అయినా చెప్పుకోవచ్చుననీ... దానికి తగిన పరిష్కారం, సాంత్వన లభిస్తాయనీ నమ్మకం కలిగిన రోజున అబద్ధం చెప్పాల్సిన అవసరమే రాదు. కారణాన్ని గ్రహించండి ప్రతీ అబద్ధం వెనుకా ఏదో ఒక కారణం ఉండవచ్చు. దాన్ని గ్రహించే ప్రయత్నం చేయమంటున్నారు. పిల్లలు సిగ్గుతోనో, భయంతోనో, అలవాటుగానో, ఎవరూ తెలుసుకోలేరనే ధీమాతోనో అబద్ధం చెప్పి ఉండవచ్చు. కారణం ఏమిటని కనుక గ్రహిస్తే వారి ఎదుగుదల గురించి విలువైన విషయాలు తెలుస్తాయి. మున్ముందు వారితో ఎలా మెలగాలో సూచన వినిపిస్తుంది. వయసుని బట్టి అబద్ధం ‘మా ఇంట్లో రివాల్వర్ ఉంది!’ అని ఓ పసిపిల్లవాడు అబద్ధం చెప్పాడే అనుకోండి. అది కేవలం గొప్ప కోసం చెప్పిన విషయం కావచ్చు. ‘మా కుక్క మాట్లాడుతుంది!’ అని ఓ 18 ఏళ్ల కుర్రవాడు చెబితే అతను సరదా కోసం చెప్పిన సంగతి కావచ్చు. పిల్లల వయసుని బట్టి వారు చెప్పే సందర్భాన్ని బట్టి ఒక విషయం అబద్ధమా కాదా అని తేల్చుకోవాల్సిందే కానీ ప్రతి విషయానికీ చిందులు వేయడం తగదు. విలువలు తెలిస్తే సరి నిజాయితీగా ఉండటం, చేసిన పనికి బాధ్యతని స్వీకరించడం, ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండటం... వంటి విలువలు పిల్లలకి తెలిస్తే వారి వ్యక్తిత్వం దృఢపడుతుంది. అబద్ధాలు చెప్పడం, పుకార్లు సృష్టించడంలాంటి పనులకు పాల్పడరు. మన ప్రవర్తన, వ్యక్తిత్వం ద్వారానే పిల్లలకి ఇలాంటి విలువలు తెలుస్తాయి. మనమే వారి ముందు అబద్ధాలు చెబుతూ ఉంటే వారి ప్రవర్తన మరో రకంగా ఎలా ఉంటుంది? సమయం కేటాయించాలి పిల్లలు ఏం చెప్పినా ఓపికగా వినేందుకు సిద్ధంగా ఉండాలి. వారితో గడిపేందుకు, వాళ్లు చెప్పే విషయాలు వినేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. వారి మాటల్ని ఏవో పిల్ల మాటలుగా సరిపెట్టేయకుండా... ఓపికగా వారి ప్రశ్నలకు తిరిగి జవాబు చెప్పాలి. అప్పుడే వారికి మనం విలువనిస్తున్న విషయం అర్థమవుతుంది. తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకునేందుకు తగిన స్వేచ్ఛ లభిస్తుంది. అన్నింటికీ మించి అబద్ధం చెప్పడం సహజమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అబద్ధం చెప్పకుండా ఏ మనిషీ ఎదగడు. అది తప్పని తెలుసుకోకపోవడమే అసలు సమస్య! పై జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్య రానే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు. - నిర్జర.
పిల్లలు అబద్ధం చెబుతుంటే! Publish Date: Jul 25, 2025 9:30AM