వాలెంటైన్స్ డేకు నిరసనగా తల నరికేశాడు!

 

ఎవడి పిచ్చి వాడికానందం! ఇది చాలా పాత మాటైనా ప్రతీ రోజూ కొత్తగానే వాడుకోవచ్చు! అలాంటి పిచ్చి వాళ్లు భూమ్మీద పెరిగిపోతూ వున్నారు! ఫిబ్రవరీ 14 వస్తోందంటే నెల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది! అసలు ప్రేమకి ఒక దినం ఎందుకు అని వాలెంటైన్స్ డేను సమర్థించే వారు ఆలోచించరు. మిగతా రోజుల్లో ఎవ్వరూ ప్రేమించుకోరా? ప్రపోజ్ చేసుకోరా? ఎందుకు మరీ కార్పోరేట్ల మాయలో పడి ఫిబ్రవరీ పద్నాలుగున కోట్ల రూపాయాల వ్యాపారం వారికి చేసి పెట్టడం? ఎందుకు పవిత్రమైన ప్రేమని గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, పబ్బుల్లో మందుపార్టీలతో సమానం చేయటం? ఇదంతా యూత్ ఆలోచించదు! అది వారి పిచ్చి...

 

ఒకవైపు లవ్వర్స్ డే నాడు పార్కుల్లో పొదల్లో దూరితేనే ప్రేమించుకున్నట్టు అనుకునే జనరేషన్ వుంటే... మరోవైపు మత సంస్థల హడావిడి! ఎక్కడ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపించినా పెళ్లి చేస్తామంటూ గోల. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. డెమోక్రసీ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. కాబట్టి దాన్ని హరించే హక్కు హిందూ, ముస్లిమ్, ఏ మతానికి చెందిన అతి వాద సంస్థకూ లేదు. కాకపోతే, ఇక్కడ వాలెంటైన్స్ డేను వారు విమర్శించటం మాత్రం తప్పు కాదు. దానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి దాడులు చేయటమే పొరపాటు. కాని, ఇలాంటి ప్రవర్తన ప్రపంచ వ్యాప్తంగా అతివాద మత సంస్థలు మానుకోవటం లేదు. ఇదీ వాలెంటైన్స్ డేలోని మరో రకం పిచ్చి!

 

వద్దనే వాళ్లు, కావాలనే వాళ్ల మధ్య వాలెంటైన్స్ డే వార్స్ ప్రతీ యేడు జరిగినట్టే ఈ సారీ జరుగుతున్నాయి! కాని, మతోన్మాదానికి మతిపోగొట్టే నిదర్శనమైన ఐఎస్ఐఎస్ సరికొ్త్తగా తన వాలెంటైన్స్ డే కసిని ప్రదర్శించింది. ఇరాక్ లోని మోసుల్ నగరంలో ఓ మసీద్ లో ఏం జరిగిందో తెలుసా? అక్కడున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇస్లాం ప్రబోధకుడు ఓ మెడ తెగ నరికాడు! అయితే, ఐసిస్ ఉగ్రవాదులకి అలవాటున్నట్టుగా , ఎప్పటిలా మనిషి తల నరకలేదు! అదొక్కటే ఇక్కడ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం! ఒక ఎర్రటి టెడ్డీ బేర్ బొమ్మ తలని తెగ నరికి వాలెంటైన్స్ డే జరుపుకోవద్దని హెచ్చరించాడట! అతను మత ప్రబోధకుడు కావటంతో అలా చేశాడు. పూర్తి స్థాయి ఐఎస్ఐఎస్ మతోన్మాద జిహాదీ అయితే మనిసి తలే నరికావాడనుకుంటా! అలాంటి దారుణాలు గత కొన్నేళ్లలో ఎన్నో...

 

ప్రేమికుల రోజుని వ్యతిరేకించటం ఎవరైనా చేయవచ్చు. కాని, ఆ క్రమంలో యువతీ, యువకులు తప్పు చేస్తున్నారంటూ అంతకంటే దారుణమైన చర్యలకు పాల్పడటం ఎంత మాత్రం మంచిది కాదు. ఇరాక్ లో టెడ్డీ బేర్ తల నరికిన మత చాంసవాది మెంటాలిటి అలాంటిదే! నరికింది బొమ్మ తలే అయినా అతడి లాంటి వాళ్లలో గూడుకట్టుకున్న మతోన్మాదం, అసహనం, హింసాత్మక ధోరణి... ప్రపంచ శాంతికి చాలా ప్రమాదకరం! ఖచ్చితంగా వాలెంటైన్స్ డే సంస్కృతి కన్నా దారుణం...