బీజేపీ సీఎం అభ్యర్థికి పోటీగా 'వాజ్‌పేయి' మేనకోడలు

 

బీజేపీ అంటే ఇప్పుడు ముందుగా మోదీ, అమిత్ షా పేర్లు గుర్తుకొస్తాయి కానీ.. ఒకప్పుడు బీజేపీ అంటే వాజ్‌పేయి, అద్వానీ పేర్లు గుర్తుకొస్తాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంతలా నిలదొక్కుకుందంటే అప్పుడు వాళ్లేసిన బలమైన పునాదులే కారణం. అద్వానీ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డారు. వాజ్‌పేయి ప్రధానిగా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా పార్టీకి గౌరవం తీసుకువచ్చారు. అలాంటిది ఇప్పుడు వాజ్‌పేయి మేనకోడలు.. బీజేపీ సీఎం అభ్యర్థికి పోటీగా బరిలోకి దిగుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సమరం ఆసక్తిగా మారింది. రాజ్‌నందగావ్‌ నియోజకవర్గంలో బీజేపీ తరఫున సీఎం రమణ్‌సింగ్‌ పోటీ చేయనుండగా.. కాంగ్రెస్‌ తరపున వాజ్‌పేయి మేనకోడలు కరుణ శుక్లా బరిలోకి దిగుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్‌ తొలి దశ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ జాబితాలో కరుణ శుక్లా పేరు కూడా ఉంది. నవంబరు 12న ఛత్తీ్‌సగఢ్‌లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.