యూకేలో భారీగా తగ్గిన స్టూడెంట్ వీసాలు: ఇండియన్ విద్యార్థులకు కొత్త చిక్కులు.!
Published on: Fri Nov 27, 2026 2:09PM

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇండియన్ స్టూడెంట్ లకు చిక్కులు తప్పడం లేదు. ఆ దేశం వీసా ప్రక్రియను క్లిష్టతరం చేయడమే కాకుండా, స్టూడెంట్ వీసాలలో భారీ కోత విధించింది. ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్లకు మంజూరయ్యే స్టూడెంట్ వీసాల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. యూకే హోం ఆఫీస్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన స్టూడెంట్ వీసాలు 29 శాతం మేర పడిపోయాయి.
ఈ కాలంలో ఇండియా దరఖాస్తుదారులకు కేవలం 69 వేల 855 వీసాలు మాత్రమే మంజూరయ్యాయి. మొత్తం జారీ అయిన వీసాలలో ఇది 22 శాతం. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 24 శాతం వాటాతో చైనా మొదటి స్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం మీద యూకే జారీ చేసిన స్పాన్సర్డ్ స్టడీ వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23 శాతం తగ్గి 3 లక్షల35 వేల801కి తగ్గింది.
వీసాల జారీ తగ్గడంతో పాటు తిరస్కరణలు, దరఖాస్తుల ఉపసంహరణలు కూడా పెరిగాయి. హోం ఆఫీస్ వివరాల ప్రకారం.. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో వీసా తిరస్కరణల రేటు 6.4 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇది 3.1 శాతం మాత్రమే. అంటే తిరస్కరణ రేటు రెట్టింపు కంటే ఎక్కువ అయ్యింది. 2026 జులై నుంచి సెప్టెంబర్ మధ్య 3 వేల 682 మంది తమ దరఖాస్తులను నిర్ణయం వెలువడక ముందే ఉపసంహరించుకున్నారు; గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 779 మాత్రమే. అంటే ఉపసంహరణలలో 370 శాతం పెరుగుదల కనిపించింది.

ఇది ప్రభావం ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ (మాస్టర్స్) కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులపై ఎక్కువగా పడింది. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో మాస్టర్స్ కోర్సుల కోసం 1,81,920 వీసాలు మాత్రమే మంజూరయ్యాయి, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 29 శాతం తక్కువ. మొత్తం స్పాన్సర్డ్ వీసాలలో మాస్టర్స్ విద్యార్థుల వాటా కూడా 63 శాతం నుంచి 58 శాతానికి తగ్గింది.
ఇది కూడా చదవండి: అమెరికా వీసా నిబంధనల ఉచ్చు: లక్ష డాలర్ల భారం.. హెచ్-1బి నిపుణులకు తప్పని తిప్పలు
యూనివర్సిటీలపై యూకే ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలే ఈ మార్పులకు ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2026 జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, విద్యాసంస్థలు తమ విద్యార్థుల వీసా తిరస్కరణల రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా కోర్సు ఎన్‌రోల్‌మెంట్ రేటు 95 శాతం కంటే ఎక్కువగా, కోర్సు పూర్తి చేసే వారి రేటు 85 శాతం కంటే ఎక్కువగా ఉండాలనే షరతులు ఉన్నాయి.

ఈ కఠిన ప్రమాణాలను అందుకోవడానికి కొన్ని యూనివర్సిటీలు నిర్దిష్ట దేశాల విద్యార్థులకు స్పాన్సర్‌షిప్ అందించడాన్ని తగ్గించుకుంటున్నాయి. దరఖాస్తుల పరిశీలన, అర్హతల విషయంలో విద్యాసంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రాబోయే ప్రవేశాల సీజన్లలో విద్యాసంస్థలు కూడా తమ స్పాన్సర్‌షిప్ విధానాలను, ప్రవేశాల ప్రమాణాలను మరింత కఠినతరం చేసే అవకాశాలు ఉన్నాయి.
మీకు నచ్చవచ్చు: అమెరికా వీసా అర్జంట్‌గా కావాలా? జూలై 1 నుంచి కొత్త రూల్స్!
భారతీయులకు ఖరీదైనదిగా అమెరికా!
[UK student visas, Indian students, Decline, UK visa rejection, visa statistics, TeluguOne]


