తిరుమల మూడో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. పరిశీలనకు నిపుణుల కమిటీ
posted on Jul 22, 2025 4:12PM

తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఘం క్యూ కాంప్లెక్స-3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీని వేయాలని తరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించింది. తిరుమల లోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు తెలిపారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు (లాంజ్ లు) ఏర్పాటుకు గల అవకాశాలను అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా మౌలిక వసతుల కల్పన, భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు.
ఇక తిరుమలలో శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత పర్యాటక ఆకర్షక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల వేంకటేశ్వరుని వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది. తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించేందుకు టీటీడీ ఆమోదంచింది.