షర్మిలపై మంత్రి హాట్ కామెంట్స్ 

వైఎస్ షర్మిల పార్టీ రాకముందే   తెలంగాణలో రాజకీయ కాక పెరుగుతోంది. రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆమె చేపిన వ్యాఖ్యలు, కేసీఆర్ సర్కార్ పై చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో  షర్మిలను టార్గెట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ మరోసారి షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొందరు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని.. ఇక్కడ వేరే పార్టీలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నగంగుల.. సీఎం కెసిఆర్ పెట్టిన టిఆర్ఎస్‌నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని.. టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు.కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్ షర్మిలను కొన్ని రోజులుగా గంగుల కమలాకర్ టార్గెట్ చేశారు. మొదట షర్మిల వస్తారని, ఆ తర్వాత జగన్ ఎంట్రీ, ఆ తర్వాత చంద్రబాబు వస్తారని.. అప్పుడు తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్నారు. ‘ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోంది. తర్వాత మెల్లగా జగన్ వస్తారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవు. కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు. కేసీఆరే మన రక్షకుడు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు.’ అని గంగుల కమలాకర్ ఇటీవల కామెంట్ చేశారు.