మునిసిపల్ ఎన్నికల పోరు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ జోరు!!

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో.. కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే అధికార టీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ స్థానిక ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ విజయ డంఖా మోగించింది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన గులాబీ పార్టీలో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే వచ్చినప్పటికీ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించి టీఆర్ఎస్ బలాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల భారమంతా మంత్రి అజయ్ కుమార్ మీదనే ఉంది. జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వం బలహీనంగా ఉండటం టిఆర్ఎస్ కు కలిసొచ్చే అంశంగా మారింది. 

గత మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 97 వార్డులు ఉంటే వాటిలో కేవలం ఐదు వార్డుల్లోనే టీఆర్ఎస్ గెలుపొందింది. ఇల్లెందులో మూడు, మధిరలో ఒకటి, కొత్తగూడెంలో మరొకటి కలిపి ఐదింటిని దక్కించుకుంది. సత్తుపల్లిలో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది. అయితే నాలుగు మున్సిపాలిటీలను ఫిరాయింపుదారుల సహకారంతో టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మధిరలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే ఆ తరువాత ఆమె కూడా టిఆర్ఎస్ కండువా కప్పేసుకుంది. మధిర సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోట, ఇక్కడ భట్టిని ఓడించేందుకు జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు టిడిపితో కలసి పోటీ చేయడానికి టిఆర్ఎస్ ప్రయత్నించి విఫలమైందని సమాచారం. దీంతో టిడిపి, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 

సత్తుపల్లిలో గత ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది. టిడిపి నుంచి చైర్ పర్సన్ గా దొడ్డాకుల స్వాతి ఎన్నికయ్యింది. ఆ తరువాత ఈమె కూడా టిఆర్ఎస్ లో చేరిపోయింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ వైపే ఉండటంతో ఇక్కడ గులాబీ పార్టీ గుబాళించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో గత ఎన్నికల్లో ఒక్క వార్డు మాత్రమే దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఛైర్మన్ సీట్ దక్కింది. ఆ తరవాత వారు కూడా టిఆర్ఎస్ లో చేరి పోయారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంది. ఇక్కడ గెలుపు బాధ్యతను వనమా వెంకటేశ్వరరావుకు అప్పగించారు. జలగం వర్గీయుల సపోర్ట్ ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఇల్లెందు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇక్కడ నాలుగు వార్డుల్లో గెలిచింది. ఆ తరువాత చైర్ పర్సన్ మడత రమాతో పాటు పలువురు టీఆర్ఎస్ లో చేరి పోయారు. ఇక్కడ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మడత రమా వర్గాల మధ్య పోరు సాగుతోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే. 

ఇక వైరా మున్సిపాలిటీకీ మోదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్ కు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇరువర్గాలూ ఎన్నికల్లో బాహాబాహీకి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇల్లెందు వైరాలలో ఆధిపత్య పోరును సద్దుమణిగించేందుకు మంత్రి పువ్వాడ ప్రయత్నిస్తున్నారు. ఐదు మున్సిపాల్టీల్లో గెలుపు బాధ్యత ఇప్పుడు మంత్రి పువ్వాడ పైనే ఉంది. ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యర్థులను సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలిపించడానికి మంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారు.